Sunday 6 March 2016

శివరాత్రి పర్వదినం

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. పరమశివుడిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివ నామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి.

శ్రీశైలం భక్త జనసంద్రం 
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లికార్జునస్వామి దర్శనానికి క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు శిద్దా రాఘవరావు, అచ్చెన్నాయుడు మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు రాత్రి స్వామికి లింగోద్భవ కాలమహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, నందివాహన సేవ, పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
శ్రీకాళహస్తిలో...
ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తి భక్త జనకోటితో కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అర్థరాత్రి 2 గంటల నుంచే స్వామివారి దర్శనానికి అనుమతిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనానికి భక్తులు బారులు తీరారు. రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలను రద్దు చేసి లఘుదర్శనాన్ని అమలు చేస్తున్నారు. క్యూలైన్లలోని భక్తులకు ప్రసాదాలు, పాలు పంపిణీ చేస్తున్నారు. పదేళ్ల తర్వాత స్వామి, ఆమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను స్వర్ణాభరణాలతో అలంకరించారు. తిరుపతి, నెల్లూరు, చెన్నై నుంచి శ్రీకాళహస్తికి ఆర్టీసీ ప్రత్యే బస్సులు నడుపుతోంది.
శివరాత్రి పర్వదినం సందర్భంగా పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. పరమశివుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. తిరుపతిలోని కపిలేశ్వర ఆలయం, కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి ఆలయంతో పాటు అన్ని ప్రాంతాల్లోని శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.

తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రప్రభుత్వం తరపున ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ప్రాంతాల నుంచి ప్రముఖ శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది
.


No comments:

Post a Comment