Monday, 7 March 2016

మార్చి 6న ఆదిలాబాద్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మార్చి 6న ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సరిహద్దున ఆదిలాబాద్‌ నియోజకవర్గ రైతుల కోసం పెన్‌గంగాపై చనాక, కోర్ట ఆనకట్ట, ఖానాపూర్‌ నియోజకవర్గ ప్రజల కోసం మామడ మండలం పోన్కల్‌ వద్ద గోదావరిపై సదర్మాట్‌ ఆనకట్ట నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.
పెన్‌గంగా నదిపై చనకా, కోర్ట ఆనకట్ట నిర్మాణ పనులకు రూ.224 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయి. దీనివల్ల జైనథ్‌, బేల మండలాల్లోని 13,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. కడెం, ఖానాపూర్‌ మండలాల రైతుల ప్రయోజనార్థం మామడ మండలం పోన్కల్‌ శివారులో సదర్మాట్‌ ఆనకట్ట నిర్మాణ పనులకు రూ.516.33 కోట్లకు పరిపాలన ఆమోదం లభించింది. దశాబ్దాల నుంచి ఆనకట్టల నిర్మాణంపై ప్రజలు ఆశలు పెంచుకోగా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వీటికి మోక్షం లభించింది. చనాక, కోర్ట ఆనకట్ట పనుల శంకుస్థాపనకు సీఎం కేసీఆర్‌ నేరుగా జైనథ్‌ మండలం కోర్ట గ్రామానికి రానున్నారు.
అక్కడే హెలిప్యాడ్‌ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా యంత్రాంగానికి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సూచనలు వచ్చినట్లు సమాచారం. కాగా, ముఖ్యమంత్రి పర్యటనపై అధికారికంగా ఇంకా ఉత్తర్వులు విడుదల కాలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనకు సంబంధించి ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ నీటిపారుదల శాఖ ఈఈ వెంకటేశ్వర్‌రావ్‌, డీఈ జగదీశ్‌, ఏఈ రవికుమార్‌, సీఐ నరేష్‌కుమార్‌లతో కలసి సదర్మాట్‌ వద్ద స్థల పరిశీలన చేశారు. మార్చి 6న ఖానాపూర్‌కు సీఎం కేసీఆర్‌ వస్తున్నారని, ఆనకట్ట పనుల శంకుస్థాపనకు సదర్మాట్‌లో సన్నాహాలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు

No comments:

Post a Comment