- నల్గొండ జిల్లా పొనుగోడు గ్రామస్తుల నిర్ణయం
కనగల్, మార్చి 29: గ్రామ పెద్దల అనుమతి లేనిదే క్రైస్తవ మత ప్రచారకులు ఊళ్లోకి ప్రవేశించరాదని నల్గొండ జిల్లా కనగల్ మండలం పొనుగోడు గ్రామస్థులు నిర్ణయించారు. ఈ మేరకు గ్రామశివారులో బోర్డును కూడా ఏర్పాటుచేశారు. గ్రామంలో 650 కుటుంబాలుండగా దాదాపు అందరూ హిందువులే. అయితే, కొన్నేళ్లుగా క్రైస్తవ మతప్రచారకులు వస్తూ నిరక్షరాస్యులైన పలువురికి మతబోధతో 20 కుటుంబాలను మతం మార్చేశారు. మరికొన్ని కుటుంబాలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, వృద్ధులను, వితంతువులను, అమాయకులను బలవంతంగా మతం మార్చుతున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనికితోడు ఇటీవల ఓ కుటుంబంలో క్రైస్తవం పుచ్చుకున్న భర్త ఎల్లమ్మ భక్తురాలైన భార్యను కూడా మతం మారాలని వేధించడం మొదలుపెట్టాడు. భర్త తరచూ కొడుతుండడం తో ఆ బాధ తట్టుకోలేని ఆమె వివాదాన్ని గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లింది. పెద్ద మనుషులు వారిద్దరికి సర్దిచెప్పి ఎవరి ఇష్టానుసారం వారి దేవుడిని కొలుస్తూ సఖ్యతతో ఉండాలని సూచించారు. కానీ భర్త ఆ మహిళను వేధిస్తూనే ఉండడం.. ఆమె పెద్ద మనుషుల వద్దకు రావడం నిత్యకృత్యమైంది. మరో సంఘటనలో.. గ్రామానికి చెందిన ఓ యువతిని వేరే ప్రాంతానికి చెందిన వృద్ధ పాస్టర్‌కు ఇచ్చి ఇష్టం లేని వివాహం చేశారు. ఆమె కాపురానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. దీంతో.. ఎన్నో రకాల సమస్యలకు కారణమైన క్రైస్తవ మతప్రచారం చేస్తున్న పాస్టర్లను గ్రామంలోకి రాకుండా నిషేధం విధించాలని గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఊరి శివార్లలో వారు ఏర్పాటు చేసిన బోర్డు ఇప్పుడు మండలంవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
No comments:
Post a Comment