Sunday, 6 March 2016

ఈ-మెయిల్‌

సాధారణంగా స్పామ్‌ బాక్సులోకి వచ్చే మెయిళ్లను ఎవరూ పట్టించుకోరు. అవన్నీ అనవసరమైనవని ఓపెన్‌ చేయకుండానే డిలీట్‌ చేస్తుంటారు. అయితే.. ఇక నుంచి అలా చేయకండి. జంక్‌ మెయిళ్లను కూడా జాగ్రత్తగా తెరిచి చూడండి. వాటిల్లో ఎంతో విలువైన సమాచారం ఉండొచ్చని చెబుతోంది ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ రచయిత్రి హెలెన్‌ గార్నర్‌. స్పామ్‌ బాక్సులోకి వచ్చింది కదా.. అని డిలీట్‌ చేసి ఉంటే.. తాను రూ.కోటి బహుమతిని కోల్పోయేదాన్నని చెబుతోంది.
అమెరికాలోని ప్రముఖ యేల్‌ యూనివర్సిటీ.. తాజాగా తొమ్మిది మంది సాహితీవేత్తలకు ‘వింఢమ్‌ షాంప్‌బెల్‌’ పేరుతో పురస్కారాలు ప్రకటించింది. అందులో ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ రచయిత్రి హెలెన్‌ గార్నర్‌ పేరు కూడా ఉంది. ఒక్కొక్కరికి లక్షా యాభై వేల డాలర్లు(సుమారు రూ.కోటి 48 వేలు) బహుమతిగా ఇస్తారు.
అందుకు ‘‘మీ ఫోన్‌ నంబర్‌ ఇవ్వండి’’ అంటూ హెలెన్‌ గార్నెల్‌కు విశ్వవిద్యాలయ అధికారులు పంపిన ఈ-మెయిల్‌ స్పామ్‌ బాక్సులోకి వెళ్లిందట. అయితే.. స్పామ్‌ కదా ఆ మెయిల్‌ను డిలీట్‌ చేయకుండా జాగ్రత్తగా తెరిచి చూసి ఆశ్చర్యానికి గురైందట హెలెన్‌. ఆ తర్వాత యూనివర్సిటీని సంప్రదించి తన వివరాలు ఇచ్చిందట. ‘‘స్పామ్‌ బాక్సులోకి వచ్చింది కదా.. అనవసరమని తొలగించి ఉంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన.. విలువైన ఆ పురస్కారం కోల్పోయేదాన్నేమో. అందుకేజంక్‌ మెయిళ్లను వూరికే డిలీట్‌ చేయొద్దు. కొన్ని సార్లు వాటిల్లోనూ ఎంతో ముఖ్యమైనవి ఉండొచ్చు’’ అని చెబుతోంది రచయిత్రి గార్నర్‌.అందుకే.. స్పామ్‌ బాక్సులోకి వచ్చిన మెయిళ్లను డిలీట్‌ చేసే ముందు.. అందులో ఏవైనా ముఖ్యమైనవి ఉన్నాయేమో ఒకటికి రెండు సార్లు చూసుకోండి మరి!

No comments:

Post a Comment