Tuesday 22 March 2016

ఇక నుండి మా గ్రామస్థులం ఎవ్వరం కట్నం తీసుకోం.................?

అక్కడ వరకట్నం నేరం...........!

అక్కడ వరకట్నం నేరం
       ఆఊరి పేరు సిద్దార్థ్‌ నగర్‌, ఉత్తర ప్రదేశ్‌లో ఉంది. ఆ గ్రామంలో కట్నం తీసుకోవడం నిషేధం. నిషేధం అంటే ఏదో మొక్కుబడిగా కాదు. కట్నం తీసుకున్న ఫ్యామిలీ మొత్తాన్ని నిర్దాక్షిణ్యంగా గ్రామం నుండి బహిష్కరిస్తారు. ఇందులో ఏ కులం వారికైనా ఎటువంటి మినహాయింపు లుండవు. వరకట్న సమస్యను పూర్తిగా రూపుమాపడానికి ఆ గ్రామ ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
'ఇక నుండి మా గ్రామస్థులం ఎవ్వరం కట్నం తీసుకోం' అంటూ ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈ విప్లవాత్మక నిర్ణయానికి కారణం చదువుకున్న యువత. వీరు 'అంజుమన్‌ రజా ఇ-ముస్తఫా' అనే సంస్థ ఆధ్వర్యంలో వరకట్న సమస్యను అంతం చేయడానికి అడుగు ముందుకేశారు. వీరి బాటలోనే అక్కడి ిస్థానికులు, గ్రామ ప్రజలంతా నడుస్తున్నారు. 
ఇక్కడ వరకట్నం ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు పెళ్లి సమయంలో దుబారా ఖర్చులు చేసినా, ఆర్భాటాలకు పోయి ఎక్కువ మొత్తంలో పెళ్లికి ఖర్చు పెట్టినా కూడా నేరమే. మేము వీటికి వ్యతింకం అంటూ ప్రతిజ్ఞ చేయించారు.ఈ నిర్ణయానికి కట్టుబడి, పెళ్లి ఖర్చులు తగ్గించుకుంటున్నారు ఆ గ్రామస్థులు.
ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉందట. వరకట్నం కారణంగా గత మూడు సంవత్సరాలలో 24,771 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌ లోనే 7,048 మరణాలు సంభవించాయి. ఆడపిల్లల ప్రాణాలు తీస్తున్న ఈ వరకట్న సమస్యను అంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు అక్కడి యువత.
ఆడపిల్ల పుట్టగానే ఖర్చులు ఎక్కువని, పెద్దయ్యాక పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని చాలా బరువు బాధ్యతలున్నాయని, భూమి మీద పడ్డ మరుక్షణం నుండీ చాలామంది ఆడపిల్లను భారంగానే చూస్తున్నారు.
ఆడపిల్లకు చదువెందుకని పెళ్ళికి ప్రాధాన్యత ఇవ్వడం, మగపిల్లల కంటే తక్కువగా చదివించడం ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఆడపిల్లను తక్కువగా చేస్తూ, చులకనగా చూస్తున్నారు. 
ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్ల కుటుంబానికి రాకూడదని, వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం తప్పుగా భావిస్తూ ఇక్కడ వరకట్నంను రూపుమాపారు. ఇక్కడ 120 ముస్లిం కుటుంబాలు, 80 హిందూ కుటుంబాలు ఉన్నాయి. తమ పిల్లలను ఎటువంటి ఒత్తిడులు లేకుండా సంతోషంగా చదివించుకుంటూ, వరకట్నం, అమ్మాయి పెళ్లి గురించి మాకెటువంటి భయంలేదంటూ గర్వంగా చెబుతున్నారు ఈ గ్రామస్థులు. 
దేశంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలు ఇలాంటి ప్రతిన బూని ఆడపిల్లలను చదివించి, వారి అభివృద్దికి తోడ్పడితే ఎంతో బాగుంటుందని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది కదూ... 

No comments:

Post a Comment