Monday, 7 March 2016

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మాతృస్వామ్యంతో మొదలు పెట్టిన సమాజం తర్వాతర్వాత పురుషాధిక్యత వైపు మొగ్గుతూ వచ్చినా.. ఇప్పుడిప్పుడు మహిళల అన్ని రంగాలనూ తమ ఆధీనంలోకి తెచ్చేసుకుంటున్నారు. నేడు దేశంలోని ప్రధాన బ్యాంకులన్నీ ఆడవాళ్ల ఆధీనంలో వున్నవే. ఇది పూర్తిగా మహిళల విజయం. ఇది ముమ్మాటికీ వారి వినయశీలతకూ.. విశ్వసనీయతకూ.. వారి శక్తిసామర్ధ్యాలకూ నిదర్శనం. ఆడవారికి ఆర్ధిక స్వాతంత్రం రావాలని ఆశించడం ఇప్పుడు పాత మాట. ఆడవారి చేతిలో ఆర్ధికరంగం కొత్త మాట.
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూంటాము. అందుకే తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లుచేసింది. మహిళాదినోత్సవం సందర్భంగా సాయంత్రం 5:30 గంటలకు లలితాకళాతోరణంలో ‘విశిష్ట మహిళా పురస్కార ప్రదానోత్సవం’ పేరిట తెలంగాణ స్త్రీ శిశుసంక్షేమ, భాషా సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా ఉత్సవం నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన నారిమనులకు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా విశిష్ట మహిళా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
మార్చి 8 చరిత్రలో నిలిచిపోయిన ఒకఘట్టం. పదిగంటల పనిదినాలకోసం, పురుషులతో సమానమైన వేతనాలకోసం పశ్చిమ పెన్సిల్వేనియాలోని ఒక బట్టల మిల్లులో సమ్మె ప్రారంభమైంది. ఇందులో 5000 మంది పాల్గొన్నారు. ఇతర ప్రాంతాలకూ విస్తరించింది. చివరకు 1857 మార్చి 8వ తేదీన ఈ సమ్మె విజయవంతమైంది. మొట్టమొదటిసారిగా దీనిని 1911 మార్చి 19న పాటించడం జరిగింది. ఆస్ట్రియా, డెన్మార్క్‌, జర్మనీ, స్విట్జర్‌లాండ్‌లలో జరిగిన ఊరేగింపులలో పది లక్షలకు పైగా స్త్రీ, పురుషులు పాల్గొన్నారు. దీని మూలాలు 1909 ఫిబ్రవరి 28న న్యూయార్క్‌ నగరంలో మొదటి జాతీయ మహిళా దినోత్సవం పాటించడంలో ఉన్నాయి. 1975లో ఐరాస మార్చి 8ని అంతర్జాతీయ మహిళాదినోత్సవంగా పేర్కొంది.
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు గడచిన దశాబ్ద కాలంగా భారీ సంఖ్యలో చట్టాలు రూపుదిద్దుకున్నాయి. కార్యక్షేత్రంలో స్త్రీపురుషులకు సమానమైన వేతనాన్ని ఇవ్వాలి. మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు మరియు స్నానాల గదులు ఏర్పాటు చేయాలి. ఏ మహిళను కూడా దాస్యభావంతో చూడరాదు. బలాత్కారం నుంచి బయటపడేందుకు అవసరమైతే సదరు పురుషుని హత్య చేసే అధికారం మహిళకు ఉంది. వరకట్నం తీసుకోవడం లేదా ఇవ్వడం చట్టవిరుద్ధం.
నాటి నుంచి నేటి వరకు అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు మేటిగా ఎదిగారు. పంజాబ్‌లో పుట్టిన పునీతాఅరోరా దేశం గర్వించదగ్గ ఆర్మీ అధికారులలో ఒకరిగా నిలిచారు. తండ్రి ఆమెను వైద్యురాలిని చేయాలని భావిస్తే, ఆర్మీ కాలేజీలో చదివిన పునీతా అరోరా పసివయసులోనే దేశభక్తిని నింపుకుని, ఇండియన్ ఆర్మీకి మొట్టమొదటి మహిళా కమాండర్‌గా ఎంపికై తన సత్తా చాటుకున్నారు.
ఆటలలోనూ తమ ప్రతిభా పాటవాలు చూపుతున్న సానియా, నైనా సెహ్వాల్, మిథాలి, మేరీకోమ్, సింధూ లాంటి యువ కెరటాలు భారతీయ పతాకాన్ని అంతర్జాతీయ వినువీధుల్లో ఎగురవేశారు. ఆరేళ్ల వయసులో టెన్నిస్ రాకెట్ చేపట్టిన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మూడు పదుల వయసు దాటకుండానే ఆమె సాధించిన విజయాలు, ప్రపంచ రికార్డులు అనితర సాధ్యమైనవని చెప్పవచ్చు.
ఆర్థిక రంగంలోనూ అతివల అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతోంది. స్టాక్ ఎక్సేంజ్‌లో తొలి మహిళా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికైన చిత్రా రామకృష్ణన్, ఎస్‌బిఐ తొలి చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఎల్‌ఐసి తొలి మహిళ మేనేజింగ్ డైరెక్టర్ ఉషా సంగ్వా, ఏక్సిస్ బ్యాంక్ తొలి ఎం.డి, సీఇఓ శర్మ, ఐసిఐసి ఎండీ చందాకొచ్చిర్.. ఇలా ఆర్థిక రంగంలో మహిళలు తమదైన శైలిలో తమ సంస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
దేశ విదేశాలలో బయట ప్రపంచంలో విభిన్న రంగాలలో దూసుకుపోతున్నా .. గృహిణిగా తన బాధ్యతలను నిర్వర్తించే ప్రతి తల్లి కూడా నిత్య జీవిత విజేతే.

No comments:

Post a Comment