Thursday, 24 March 2016

హెల్మెట్లు కొంటున్నారా..! అయితే జరభద్రం.

హైదరాబాద్ :ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడడానికి ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు కొంటున్నారా..! అయితే జరభద్రం. మీరు కొనే హెల్మెట్లు మీ ప్రాణాల్ని కాపాడుతాయో..చిన్న ప్రమాదానికే ప్రాణాల్ని బలిగొంటాయో తెలుసుకొండి. సరైన ప్రమాణాలు పాటించకుండా తయారైన హెల్మెట్లు వాడితే ప్రయోజనాలకన్నా..ప్రమాదాలే ఎక్కువ అంటున్నారు సాంకేతిక నిపుణులు. హెల్మెట్ కొనేముందు సరైన అవగాహనతోనే పరీక్షించి కొనుగోలు చేయాలని చెబుతున్నారు. మంచి ఉద్దేశంతో హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేసినప్పటికీ, డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. 

వీరిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రోడ్డు భద్రతను పటిష్టం చేసింది. ఇందులోభాగంగానే హెల్మెట్‌ను తప్పనిసరి చేసింది. అయితే వ్యాపారులు, తయారీదారులు హెల్మెట్‌లో నాణ్యతకు తూట్లు పొడుస్తూ వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తయారీలో నిబంధనలు పాటించకపోవడం, అమ్మకాల్లో నాణ్యత ప్రమాణాలు గాలికొదలడం వాహనదారులకు శాపంగా మారింది.

ఐఎస్‌ఐ మార్క్ పేరిట..
హెల్మెట్ల అమ్మకాల్లో ఐఎస్‌ఐ మార్క్ పేరిట నకిలీ దందా చేస్తున్నారు. బజార్లో దొరికే చాలా హెల్మెట్లపై ప్రమాణాలను సూచిస్తూ వేసే ఐఎస్‌ఐ లేబుల్ నకిలీదని విమర్శలున్నాయి. దీనిని కొనుగోలుదారులు కూడా పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ అధికారులు రోడ్డు సేఫ్టీ అమలుకు నడుంబిగించడంతో వాహన చోదకులు హెల్మెట్లు కొనుగోలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి తక్కువ ధరలో లభిస్తున్నాయనే ఆశతో ప్రమాణాలు లేని హెల్మెట్లు కొనుగోలు చేస్తున్నారు. రోడ్లకిరువైపులా వెలిసిన ఫుట్‌పాత్ దుకాణాల్లో మొత్తం నాణ్యత ప్రమాణాలు లేని హెల్మెట్లు అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. 

వీటిని నియంత్రించడానికి కానీ, వీటి నాణ్యతను పరిశీలించడానికి కానీ ఎటువంటి యంత్రాంగం లేకపోవడంతో వీరి వ్యాపారం జోరుగా సాగుతోంది. నాణ్యతా ప్రమాణాలు చూడాల్సిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) దీనిని పట్టించుకోదు. తయారీ కంపెనీల్లో తనిఖీలు చేస్తామని, ఫుట్‌పాత్ వ్యాపారులను తనిఖీ చేయడం తమ వల్ల కాదని చేతులెత్తేసింది. ఇక రవాణాశాఖ, పోలీసులు తమ వద్ద ప్రమాణాలను కొలిచే వ్యవస్థ లేదని తప్పించుకుంటున్నాయి.

ప్రమాణాలు ఇవే
మంచి ప్రమాణాలు ఉన్న హెల్మెట్ ఐఎస్‌ఐ మార్క్ ,గట్టి డిప్ప(షెల్) ఉంటుంది. షెల్ కింద ఉండే ప్యాడింగ్ (మొత్తని భాగం) సౌకర్యంగా ఉంటుంది. పాలిథిలీన్ ఫోమ్‌తో ప్యాడింగ్ చేస్తారు. గీతలు పడని, స్పష్టంగా కనబడే అద్దం బిగిస్తారు. నిజమైన ఐఎస్‌ఐ స్టాండర్డ్స్ కలిగి ఉన్నట్లయితే హెల్మెట్‌పై ఉన్న లేబుల్ తొలగించలేరు. నకిలీదైతే స్టిక్కర్ తొలిగించేలా.. తుడిస్తే కనబడకుండా పోతుంది. నిజమైన హెల్మెట్ అయితే ఐఎస్‌ఐ మార్క్‌తోపాటు తయారీదారు కోడ్ వేస్తారు. మీరు కొన్నది నకిలీదో అసలుదో ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలంటే బీఐఎస్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రమాణాలతో కూడిన హెల్మెట్ గడ్డం వద్ద 20 మీ.మీటర్ల మందంతో తయారవుతుంది. అద్దం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. అది నిలువునా, అడ్డంగా చూసినా ఒకే రకంగా కనబడుతుంది. దీని తయారీ సందర్భంగా 250 సెంటీగ్రేడ్ వద్ద వేడి చేస్తారు. అల్ట్రావాయిలెట్ కిరణాలు పడ్డా ఎటువంటి ప్రభావం ఉండదు. ఇక సౌండ్స్ విషయానికి వస్తే 10 డెసిబుల్స్ నుంచి ఎక్కువ మోతాదు సౌండ్‌ను వినపడేలా రూపొందిస్తారు. హెల్మెట్‌పై కంపెనీ పేరు, ట్రేడ్ మార్కు, సైజు, తయారు చేయబడిన సంవత్సరం ఉంటుంది. వీటన్నింటిని చూసి కొనుగోలు చేయాలి.
861

No comments:

Post a Comment