బిర్లామందిర్
బిర్లామందిర్
హైదరాబాద్: హైదరాబాద్ ఖ్యాతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటుతున్న ప్రముఖకట్టడాల్లో బిర్లామందిర్ ఒకటి. పాలరాతి నగిషీలతో సుందరమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న బిర్లామందిర్ నిర్మించి నేటికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. చారిత్రక నగరం హైదరాబాద్ సిగలో తురిమిన అందమైన ఆధ్యాత్మిక కళాఖండం.. బిర్లామందిర్. పురాణాలు, ఐతిహాసాలు, వైదిక రుషులు, భక్తి ఉద్యమ గురువుల ప్రబోధాలను ఒకేచోట ఆవిష్కరించిన విలక్షణ ఆలయమిది. బిర్లాగ్రూప్ సంస్థల ప్రముఖుడు బ్రిజ్‌మోహన్ బిర్లా జ్ఞాపకార్ధం ఆయన కుమారుడు గంగాప్రసాద్ బిర్లా 1976లో ఈ ఆలయం నిర్మాణానికి పూనుకున్నారు. ఆధ్యాత్మికవేత్త, వేదపండితుడైన పెదజీయర్‌స్వామి నేతృత్వంలో ఆనాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి అంకురార్పణ చేశారు. 7 ఏళ్లలో ప్రధాన ఆలయం నిర్మాణం పూర్తైంది. దక్షిణాది వైష్ణవ సంప్రదాయమైన శ్రీరంగం పద్ధతిలో 40 ఏళ్లుగా ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి నగరంలోని ప్రధాన కట్టడాల్లో ఒకటిగా నిలిచి, సందర్శకులు ప్రశంసలందుకుంటోంది. ఆలయం నిర్మించి 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధాన ఆలయం ప్రాంగణంలో స్వామివారి విగ్రహానికి తిరుమాడ వూరేగింపు నిర్వహించారు.హైందవ సంస్కృతి, స్వతహాగా భన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. వాటి ప్రతిరూపాలైన దశావతారాలు, మహాభారతం, రామాయణం, భాగవత గాథలతోపాటు, భక్తి ఉద్యమాలు నడిపించిన ఆధ్మాత్మిక గురువుల సుందరశిల్పాలు బిర్లామందిర్ గోడలపై కనిపిస్తాయి. వైదిక రుషులు, శైవ, వైష్ణవ మతాల పుణ్య పురుషులైన ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యుల శిల్పాలతోపాటు భౌద్దం, జైనం, క్రైస్తవం, ఇస్లాం, సిక్కు మతాల జీవన సారాంశాలు ఈ ఆలయ గోడలపై పొందుపర్చారు. దశాబ్దాలుగా ఈ జీవితసత్యాలు భక్తులు, సందర్శకులకు నైతిక విలువలను ప్రభోదిస్తున్నాయి. భిన్నమతాల ప్రజలతో పాటు భక్తులు, యాత్రికులు ప్రతిరోజూ వేల సంఖ్యలో బిర్లామందిర్‌ను సందర్శిస్తుంటారు. హైదరాబాద్‌కు వచ్చే వివిధ రాష్ట్రాల, దేశాల యాత్రికులు తప్పకుండా సందర్శించే యాత్రాస్థలాల్లో బిర్లామందిర్ ప్రముఖ స్థానంలో నిలిచింది. జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు, ఉగాది, ఏకాదశి వంటి పండుగలు, సెలవు దినాల్లో రోజుకు 50వేల నుంచి లక్షమంది వరకు బిర్లామందిర్‌కు వస్తుంటారు. నగరం నడిబొడ్డున ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన ఈ ఆలయం గర్భగుడి నుంచి మెట్ల వరకు పూర్తిగా పాలరాతితో నిర్మించడంతో విద్యుత్ దీపాల వెలుగుల మధ్య సందర్శకుల మనసు దోచుకుంటోంది.
బిర్లామందిర్ నిర్వహణ బాధ్యతలు హిందూస్థాన్ ఛారిటీ ట్రస్టు నిర్వహిస్తుండడం విశేషం. ఇక్కడ ఆలయ ప్రవేశం మోదలుకొని, పూజలు, అర్చనల వరకు అన్నీ ఉచితంగానే జరుపుతారు. బిర్లామందిర్ నిర్మాణానికి ముందు ఈ ప్రాంతాన్ని నీలాద్రీహిల్స్‌గా పిలిచేవారు. అప్పుడు ఇక్కడ ఓ చిన్న ఆంజనేయస్వామి గుడి ఉండేది. అనంతర కాలంలో బిర్లామందిర్ ప్రాంగణంలో మరో ఆంజనేయస్వామి ఆలయం, దుర్గామాత, వినాయకుడు, శిరిడీ సాయిబాబా, శివాలయంతో పాటు యజ్ఞశాలనూ నిర్మించారు. ప్రధాన ఆలయంలో వేంకటేశ్వస్వామి, పద్మావతి, ఆండాళమ్మ, గరుత్మంతుడి విగ్రహాలున్నాయి.దేశంలో జైపూర్, భోపాల్, కోల్‌కత్తా, దిల్లీలో కూడా బిర్లామందిర్‌దేవాలయాలను బిర్లా గ్రూప్ నిర్మించింది. వాటన్నింట్లోనూ హైదరాబాద్ మందిరం ప్రత్యేక స్థానం సంపాదించడం చెప్పుకోదగ్గ విశేషం. అద్భుత చిత్రాలు, శిల్పకళా సౌందర్యంతో పాటు ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా నిర్వహించే నిత్యాగ్నిహోమం అలాగే సాయంత్రం వేళ ఆళ్వార్ దివ్యప్రబంధం ఈ ఆలయానికి ఆధ్యాత్మిక శోభను సంతరించి పెడుతున్నాయి.
No comments:
Post a Comment