Saturday 6 February 2016

ఈ-కామర్స్‌లో కొలువులే.. కొలువులు



**ఈ-కామర్స్‌లో కొలువులే.. కొలువులు**

 ఈ ఏడాది కొత్తగా 2.5 లక్షల ఉద్యోగాలు
-  రానున్న రెండేండ్లలో 5-8 లక్షల నియామకాలు 

-  'టెక్‌' జోష్‌తో విరివిగా విస్తరణ
-  2016 నాటికి 3800 కోట్ల డాలర్లకు
-  తాజా నివేదికలో అసోచామ్‌ 

 న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్‌ కామర్స్‌ (ఈ-కామర్స్‌) రంగంలో పుష్కలంగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విభాగంలో కొలువుల కల్పన దాదాపు 60-65 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు అసోచామ్‌ తాజా నివేదికలో తేల్చింది. 2016లో ఆన్‌లైన్‌ రిటైల్‌ విభాగంలో 2,50,000 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. గత ఏడాది కాలంలో అత్యధికంగా ఈ-కామర్స్‌ డిపార్ట్‌మెంట్స్‌, వ్యాపార సంస్థలు తమ టర్నోవర్‌ను పెంచుకోవడం కనిపించిందనీ.. భవిష్యత్తులో ఈ పరిశ్రమ బాగా విస్తరించేందుకు ప్రస్తుతం పుష్కలంగా అవకాశాలు ఉన్నట్లుగా అసోచామ్‌ తన నివేదికలో వివరించారు. 2009లో 380 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ-కామర్స్‌ పరిశ్రమ 2014లో 1700 కోట్ల డాలర్లకు విస్తరించిందనీ.. 2016 నాటికి 3800 కోట్ల డాలర్ల మార్కును చేరే అవకాశం ఉన్నట్లు అసోచామ్‌ తన నివేదికలో విశ్లేషించింది. కొత్తగా సప్లయి విభాగం, లాజిస్టిక్‌, అనుబంధ యూనిట్లలో కొత్త ఉపాధి, తాత్కాలిక ఉద్యోగాలను కలుపుకొని 2,50,000 కొలువులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అసోచామ్‌ తెలిపింది. దేశీయంగా ఈ-కామర్స్‌ పరిశ్రమలో ఇప్పటికే 3,50,000 మంది పని చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరగడం, రిటైలర్స్‌ నుంచి పెట్టుబడులు పోటెత్తడం తదితర అంశాలు దేశంలో మొబైల్‌ కామర్స్‌ విస్తరించేందుకు దోహదం చేస్తున్నట్లుగా నివేదిక తెలిపింది. దేశీయ ఈ-కామర్స్‌ మార్కెట్‌లో మొబైల్‌ కామర్స్‌ వాటా 20-25 శాతంగా ఉంది. రానున్న రోజుల్లో ఇది ప్రధాన వ్యాపారంగా ఎదిగేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆన్‌లైన్‌ నుంచి ఆఫ్‌లైన్‌ విభాగం వైపు కూడా ఎలక్ట్రానిక్‌ కామర్స్‌ పరుగులు పెడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో రెస్టారెంట్‌లు, ట్యాక్సీలు ఈ-కామర్స్‌ విపణిలో ప్రధాన వాటాను సంపాదించుకొనే అవకాశాలు ఉన్నాయి.
'మొబైల్‌ టెక్నాలజీ, ఆన్‌లైన్‌ భద్రత, షాపింగ్‌ కనెక్టివిటీ, చెల్లింపు ప్లాట్‌ఫాంల అభివృద్ధి నేపథ్యంలో ఈ-కామర్స్‌ రంగం మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ విభాగంలో కొత్తగా ఉద్యోగ కల్పన 60-65 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందనీ.. ఫలితంగా ఈ విభాగంలో రానున్న రెండేళ్లలో 5,00,000 నుంచి 8,00,000 మేర ఉద్యోగాలు కల్పించే అవకాశాలు అధికంగా ఉన్నాయి'అని అసోచామ్‌ ప్రధాన కార్యదర్శి డి.ఎస్‌.రావత్‌ తెలిపారు. దేశంలోని ప్రధాన బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏలు పూర్తిచేసుకొని బయటకు వస్తున్న వారిలో మూడోవంతు మంది విద్యార్థులు ఈ -కామర్స్‌ సంస్థల్లో పని చేసేందుకు ఎక్కువగా అసక్తి చూపుతున్నట్లుగా నివేదిక తెలిందన్నారు. ప్రపంచంలో భారత్‌ అతిపెద్ద ఈ-కామర్స్‌ మార్కెట్‌గా ఎదగడంలో విజయవంతమైందని రావత్‌ వివరించారు. ఈ రంగం ఎదుగుదల బాగున్నట్లు తెలిపారు.


No comments:

Post a Comment