Friday, 26 February 2016

ఫ్రీడమ్ 251: తయారీ వెనుక అసలు రహస్యం ఇదే


ఫ్రీడమ్ 251: తయారీ వెనుక అసలు రహస్యం ఇదే.......

Ringing Bells now accepting cash on delivery for Freedom 251

న్యూఢిల్లీ: ప్రపంచ మొబైల్ రంగాన్ని ఆశ్చర్యంలోకి ముంచెత్తుతూ కేవలం రూ. 251కే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసి సంచలనం సృష్టించిన రింగింగ్‌బెల్స్‌ సంస్థ ప్రెసిడెంట్ అశోక్ చద్దా తన మనసులోని మాటను వివరించారు. తమ కంపెనీ ఎటువంటి దురుద్దేశాలతోనూ ఈ పని చేయలేదని, భారత్‌లో సాధారణ ఫోన్‌ను వాడుతున్న 1.4 కోట్ల మందిని స్మార్ట్‌ఫోన్‌కు దగ్గర చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లకు ఆన్‌లైన్ మార్కెట్‌ను కల్పించి, దీని ద్వారా ధరను 35 శాతం వరకూ తగ్గించవచ్చని వెల్లడించిన ఆయన, 12 మంది పెట్టుబడిదారులతో మాట్లాడుతున్నామని, ఏ సమయంలోనైనా రూ. 500 కోట్ల వరకూ సమీకరించి భారీ ఎత్తున మొబైల్స్ తయారీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాబోయే రెండు నెలల్లో రెండు మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లను ప్రారంభించి, జూన్ లోగా 25 లక్షల ఫోన్లను డెలివరీ ఇచ్చి చూపాలన్నదే తమ ముందున్న ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. 8 నెలల క్రితం సంస్థను ప్రారంభించినప్పుడు ఈ స్థాయిలో ప్రతిస్పందన ఉంటుందని ఊహించలేదని అన్నారు.ప్రభుత్వం తమ ప్రయత్నాలను ఎన్నడూ అడ్డుకోలేదని, వారు అడిగిన సమాచారాన్ని అంతా ఇచ్చామని, వారి ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పామని అన్నారు. సంస్థ ఎండీ మోహిత్ గోయల్‌తో కలసి వెళ్లి ఇప్పటికే కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో తమ ఆలోచనలను, వ్యాపార విధానాన్ని పంచుకున్నామని అన్నారు. ఇందుకు ఆయన కూడా సంతోషంగా అంగీకరించారని రింగింగ్‌బెల్స్‌ సంస్థ ప్రెసిడెంట్ అశోక్ చద్దా వివరించారు. నిజానికి రింగ్ బెల్స్ అనేది ఇప్పటి వరకు ఎలాంటి ట్రాక్ రికార్డు లేని ఓ ఎలక్ట్రానిక్ సంస్థ. ఈ నేపథ్యంలో సంస్థ అందించే ఈ స్మార్ట్ ఫోన్‌లో నాణ్యత ఎంతమేరకు ఉంటుందనే విషయం అంచనా వేయడం సాధ్యం కాదంటున్నారు నిపుణులు. అంతేకాదు ఈ మొబైల్ ఫోన్ షిప్పింగ్‌కు కూడా నాలుగు నెలల సమయం తీసుకుంటున్నారు. అయితే ఫోన్ బుక్ చేసుకున్న వారందరికీ ఈ ఫోన్ డెలివరీ వస్తుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కాగా, స్మార్ట్ ఫోన్ విడుదల కార్యక్రమంలో ఫ్రీడమ్ 251కు ఏడాది పాటు వారంటీ ఉంటుందని అన్నారు.



No comments:

Post a Comment