Monday, 5 October 2015

తెలంగాణాలో మందుబాబులకు పండగే పండగ.. ఎందుకో తెలుసా?

తెలంగాణాలో మందుబాబులకు పండగే పండగ.. ఎందుకో తెలుసా?


తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మందుబాబులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెరాస సర్కారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈమధ్య మందుబాబులు గుడుంబా తాగి ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారనీ, వారి ఆరోగ్యం కోసం చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖామంత్రి స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత విక్రయించనున్న చీప్ లిక్కర్ మద్యాన్ని కూడా మీడియాకు చూపించారు. దీనిపై తీవ్రమైన విమర్శలు రావడంతో తాత్కాలికంగా తెరాస సర్కారు వెనక్కి తగ్గింది. 
 
ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలోని మందుబాబులకు మరో వెసులుబాటును సర్కారు కల్పించనుంది. రాత్రి 10 గంటల తర్వాత మందు దొరకదేమోనని ఆందోళన ఉన్నవారు ఇక నిశ్చింతగా ఉండొచ్చు. మందుబాబుల కోసం మరో గంట అంటే రాత్రి 11 గంటల వరకు మందు షాపులు తెరిచే ఉంచనున్నారు. ఇక బార్లలో అయితే అర్థరాత్రి 12 గంటల వరకు వరకూ ఎంజాయ్‌ చేయొచ్చు. ఇదే అంశంపై కేసీఆర్ సర్కారు దీర్ఘంగా ఆలోచిస్తోంది. 
 
వాస్తవానికి, ఈ ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్నా.. ప్రభుత్వం దీనిని పక్కనపెట్టిందన్న వార్తులు వెలువడ్డాయి. కానీ.. తాజాగా పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వైన్‌ షాపులను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, బార్లను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. ఇప్పుడు చెరో గంట పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. 
 
ఈ ఆలోచన ప్రభుత్వానికి ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పన సందర్భంలోనే వచ్చింది. కానీ.. ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందేమోనని కొంత వెనక్కి తగ్గింది. అప్పట్లో టైమింగ్స్‌ పెంపు వద్దంటూ ముఖ్యమంత్రి వారించారు. ఆ తర్వాత మరొక సందర్భంలో ఇతర రాష్ట్రాల్లోని టైమింగ్స్‌పై అధ్యయనం చేయాలని ఎక్సైజ్‌ అధికారులకు కేసీఆర్‌ సూచించారు. అధికారులు మహారాష్ట్ర, ఒడిసా, హర్యానా, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లోని టైమింగ్స్‌ను అధ్యయనం చేశారు. సీఎం కేసీఆర్‌కు ఓ నివేదిక పంపారు. 
 
ఈ నివేదికలో పలు రాష్ట్రాల్లో వైన్ షాపులు, మద్యం దుకాణాలు పని చేసే తీరుతెన్నులు, వేళల వివరాలను పొందుపరిచారు. ఈ టైమింగ్స్‌ను పోలుస్తూ ఇక్కడా టైమింగ్స్‌ను పెంచాలని సీఎంకు నివేదించినట్లు సమాచారం. దీనిపై సీఎం కేసీఆర్‌ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు అధికారవర్గాలు తెలిపారు. 
beer

No comments:

Post a Comment