Tuesday, 6 October 2015

నల్లధనం: విలువ 4,147 కోట్లు, అమెరికా సమాచారం


నల్లధనం: విలువ 4,147 కోట్లు, అమెరికా సమాచారం


న్యూఢిల్లీ: కొత్త చట్టం ద్వారా కల్పించిన ఏకకాలపు వెసులుబాటు కింద వెల్లడైన విదేశీ ఆస్తుల వివరాలను ప్రభుత్వం సడలించింది. 638 ప్రకటనల కింద రూ.3,770 కోట్ల విలువైన ఆస్తుల వివరాలు వెల్లడైనట్లు ఇటీవల ప్రకటించగా ఆ మొత్తం రూ.4,147 కోట్లని తాజాగా స్పష్టం చేసింది. ఈ నెల 1న పేర్కొన్న మొత్తం ప్రాథమిక లెక్కల ఆధారంగా ప్రకటించామని రెవెన్యూ కార్యదర్సి హస్ముఖ్‌ ఆధియా సోమవారం చెప్పారు. 30 శాతం పన్ను, 30 శాతం జరిమానా కింద రూ.4,147 కోట్లపై ప్రభుత్వం రాబట్టుకునే పన్ను మొత్తం రూ.2,488.20 కోట్లు. ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా వివరాలు వెల్లడించని వారి గురించి మాట్లాడుతూ... వారు తెగింపు నిర్ణయం తీసుకున్నారని, తాము వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నల్లధనంపై తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించగా.. ఇప్పటి వరకు ఏ వర్గాల నుంచి ఏ సమాచారం వచ్చి ఉన్నా ఆ సమాచారాన్ని మదింపు వేస్తున్నామని, జరిమానా వేస్తున్నామని, విచారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రత్యేకంగా వివిధ కేసులపై ఇతర దేశాల నుంచి సమాచారం కోరే విషయమై మాట్లాడుతూ... 2014-15లో 1,600 విజ్ఞప్తులు పంపించామని, గత ఏడాది పంపించిన విజ్ఞప్తులు 800 అన్నారు. విదేశాల్లోని ఖాతాల సమాచారం వెల్లడికి సంబంధించిన ఉమ్మడి నివేదన ప్రమాణాలు 2017 నుంచి అమల్లోకి రానున్నాయన్నారు. విదేశాల్లో దాచి ఉంచిన నల్లధనం వివరాలు తెలుసుకోవడానికి ఈ ఏర్పాటు ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఫారిన్‌ అకౌంట్‌ కాంప్లియన్స్‌ యాక్ట్‌ (ఎఫ్‌ఏటీసీఏ) కింద అమెరికా నుంచి భారత్‌కు ఇప్పటికే విలువైన సమాచారం వచ్చిందన్నారు

No comments:

Post a Comment