Monday, 5 October 2015

గణపతి గుడిలో ముస్లిం మహిళకు పురుడుపోశారు


గణపతి గుడిలో ముస్లిం మహిళకు పురుడుపోశారు

ముంబై: మానత్వానికి కులం, మతం అడ్డురాదని మరోసారి చాటి చెప్పారు. నడివీధిలో పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ ముస్లిం మహిళను పక్కనే ఉన్న గుడి ఆవరణలోకి తీసుకెళ్లి పురుడు పోశారు పలువురు హిందూ మహిళలు. మానత్వానికి మించిన మతం లేదని నిరూపించారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఇల్యాజ్ షేక్ తన భార్య నూర్జహాన్‌ను ఆస్పత్రికి తీసుకెళుతున్నాడు. ఇంతలోనే ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. కాగా, ట్యాక్సీ డ్రైవర్ తన వాహనంలో కాన్పు కావడానికి వీల్లేదని ఆ దంపతులను రోడ్డుపైనే దించేశాడు. రోడ్డు మీద నొప్పులతో అవస్థపడుతున్న నూర్జహాన్‌ను పక్కనే గణేష్ మందిరం బయట కూర్చున్న కొందరు హిందూ మహిళలు చూశారు. వెంటనే వారు ఆమెను గుడి ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. అందుబాటులో ఉన్న చీరలు దుప్పట్లతో అక్కడే మరుగు ఏర్పర్చి ఆమె ప్రసవానికి సహకరించారు.
దీంతో నూర్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా, వినాయకుడి సమక్షంలో బిడ్డకు జన్మనివ్వడం కంటే అదృష్టం ఏముందంటూ నూర్జహాన్ తన బిడ్డకు గణేష్ అని పేరు పెడుతున్నట్లు చెప్పింది. ఆ తర్వాత తల్లీ, బిడ్డలను ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. తాము అడగకుండానే హిందూ మహిళలు తమకు సాయం చేశారని, వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని ఆ దంపతులు చెప్పారు. ఆ దేవుడి దయవల్లే తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు.

 Ganapati Temple

No comments:

Post a Comment