Monday, 5 October 2015

మానవాళిని వణికిస్తున్న డెంగ్యూ జ్వరం.. అందుబాటులో ప్రత్యేక బీమా పాలసీ

మానవాళిని వణికిస్తున్న డెంగ్యూ జ్వరం.. అందుబాటులో ప్రత్యేక బీమా పాలసీ


dengue mosquito
వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలంలో దోమల బెడద విపరీతంగా ఉంటుంది. దీనికితోడు ఇటీవలి కాలంలో డెంగ్యూ దోమలు మరింతగా విజృంభిస్తున్నాయి. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా డెంగ్యూ వ్యాధితో మృతి చెందిన వారి సంఖ్య వందల్లో ఉండటం డెంగ్యూ దోమ విజృంభణకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ డెంగ్యూ జ్వరంబారిన పడితే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్య సహాయం, ఔషధాల కోసం భారీగా ఖర్చు చేయాల్సివస్తోంది. 
 
సాధారణంగా డెంగ్యూ వ్యాధి బారిన పడిన వారు కనీసం మూడు నుంచి ఐదు లేదా తొమ్మిది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఆస్పత్రిలో డెంగ్యూకి చికిత్స పొందాలంటే 65 వేల నుంచి 70 వేల రూపాయల వరకు అవుతోంది. బీమా కంపెనీల డెంగ్యూ క్లెయిమ్‌ల సగటు చెల్లింపులు 30 వేల నుంచి 40 వేల రూపాయల వరకు ఉన్నట్టు సమాచారం. విడివిడిగా చూస్తే కొన్ని క్లెయిమ్‌లు గరిష్టంగా లక్ష రూపాయల వరకు ఉంటున్నాయి. 
 
అయితే, ఇపుడు బీమా రంగంలోకి ప్రవేశించిన పలు కంపెనీలు డెంగీకి కూడా ప్రత్యేకమైన బీమా రక్షణ కల్పిస్తున్నాయి. వాటి వివరాలను పరిశీలిస్తే.. సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీ అయితే కేవలం ఇన్‌పేషెంట్లకు మాత్రమే వర్తిస్తుంది. కానీ డెంగ్యూ పాలసీలు ఇన్‌పేషెంట్లే కాకుండా ఔట్‌పేషెంట్లకు కూడా కొన్ని పరిమితులకు లోబడి బీమా ప్రయోజనాన్ని కల్పిస్తున్నాయి. డెంగ్యూవ్యాధి బారిన పడిన వారిలో 15 శాతం మంది మాత్రమే ఇన్‌పేషెంట్లుగా చేరుతుండటంతో ఔట్‌పేషంట్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. 
 
కొన్ని బీమా సంస్థలు సాధారణ ఆరోగ్య బీమా ప్లాన్‌కు అనుబంధ రైడర్‌గా కూడా డెంగ్యూ బీమాను అందిస్తున్నాయి. ఇందుకు సగటున ఏడాదికి 659 రూపాయలు అదనంగా చెల్లించాలి. సాధారణ బీమాకు చెల్లించే వార్షిక ప్రీమియంకు ఇది అదనం అన్నమాట. ఇలాంటి సంస్థల్లో అపోలో మ్యూనిచ్‌ సంస్థ ముందుంది. ఈ కంపెనీ ప్రత్యేకంగా డెంగ్యూకేర్‌ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ కింద రోజుకి 1.20 రూపాయల ప్రీమియంతో 50 వేల రూపాయలు బీమా రక్షణ పొందవచ్చు. 
 
లక్ష రూపాయల వరకు కవరేజ్‌ కావాలంటే 659 రూపాయలు వార్షిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అన్ని వయసుల వారికి ఫ్లాట్‌ కింద ఈ మొత్తాన్ని వసూలు చేస్తారు. ఈ పాలసీ తీసుకోవడం తేలికే. ఎలాంటి వైద్యపరీక్షలు అవసరం లేదు. దరఖాస్తు సమర్పించే సమయానికి తనకు డెంగ్యూ లేదని ఒక డిక్లరేషన్‌ సంతకం చేస్తే చాలు. 15 రోజుల తర్వాత పాలసీ కవరేజ్‌ వర్తిస్తుంది. ఈ కంపెనీ పది వేల రూపాయల వరకు గరిష్టంగా ఔట్‌పేషెంట్‌ బిల్లులు కూడా భరిస్తోంది.

No comments:

Post a Comment