** ఇక గోల్డ్ టూరిజమ్ **
పర్యాటకులు భారత్‌కు తాజ్‌మహల్ చూడటానికి వస్తారు. రెడ్ ఫోర్ట్ చూడటానికి వస్తారు. తిరుమల వేంకటేశ్వరుణ్ణి, మధుర మీనాక్షిని చూడటానికి వస్తారు. ఇక మీదట దేవుని ఆభరణాలను చూడటానికి వస్తే? దేశంలో ప్రస్తుతం 25000 టన్నుల బంగారు ఆభరణాలు ఉన్నాయని ఒక అంచనా. ఇందులో ఐదు శాతం బంగారం మన గుడులలోనే ఉందట. ఈ బంగారం ఇవాళ్టిది నిన్నటిది కాదు. వందల ఏళ్లుగా భక్తులు ఆయా దేవుళ్లకు సమర్పించిన కానుకల్లో భాగంగా సురక్షితంగా ఉంది. పాతకాలం నాటి ఆ ఆభరణాలు, వాటి నైపుణ్యం, అందం, విలువ దర్శించడం కూడా ఒక విడ్డూరంగా ఉంటుంది.
ఉదాహరణకు తిరువనంతపురంలో నిక్షిప్తమైన విలువైన ఆభరణాలను ప్రదర్శనకు పెడితే ఈ దేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి దర్శించరూ? అందుకే ప్రపంచంలో ఏ దేశానికీ లేని ఈ వెసులుబాటును భారత్ పరిశీలిస్తోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఫిక్కీ) సంయుక్తంగా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి. భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తే కనుక దేవుని ఆభరణాలు ప్రదర్శనకు పెట్టవచ్చనే ఆలోచనతో ఈ రెండూ ప్రాథమికంగా అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదొక విధానంగా అయితే మాత్రం దేవుడు ధరించే ఆభరణాలకు నమస్కారం పెట్టుకోవడానికి భక్తులు క్యూ కడతారనడంలో ఆశ్చర్యం లేదు.
No comments:
Post a Comment