-తీవ్ర వాయుగుండంగా మారేందుకు ఆస్కారం
-తాంబన్-నాగపట్టణం మధ్య తీరం దాటే అవకాశం
-తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు
-48 గంటల్లో తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు
-విశాఖ వాతావరణశాఖ కేంద్రం ప్రకటన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్నది. నైరుతి బంగాళాఖాతం- శ్రీలంక తీరం మధ్య అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నదని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ కేంద్రం ఆదివారం ఓ ప్రకటన జారీ చేసింది. అల్పపీడనం సోమవారం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా ప్రయాణించి తీవ్ర వాయుగుండంగా మారుతుందని.. ఈ నెల 17న (మంగళవారం) ఉదయంనాటికి తమిళనాడులోని తాంబన్-నాగపట్టణం మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దీని ప్రభావం చుట్టూ 200కిలోమీటర్ల వరకు ఉంటుందని హెచ్చరించింది. కాగా, అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుంచి చెన్నై, తిరువనంతపురంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
మంగళవారం తీరం దాటనుండటంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. జాలర్లు సముద్రంలోకి వెళ్లవద్దని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, చెన్నై నగరం వచ్చే 24గంటలపాటు మేఘావృతమై ఉంటుందని.. ఆతర్వాత దట్టమైన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు విదర్భనుంచి తెలంగాణ, రాయలసీమ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి, రంగారెడ్డి జిల్లా పరిగిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాచలం, బూర్గంపాడు,గుండాల, పినపాక, మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్దల్లో 2 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
No comments:
Post a Comment