Wednesday, 25 December 2019

మే 5,6,7 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్, అగ్రికల్చర్ ఎంసెట్ 9, 11 తేదీల్లో

రాష్ట్రంలోని వివిధ వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరంలో (2020-21) ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను డిసెంబర్ 24న తెలంగాణ ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. అనంతరం ఆ వివరాలను మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణతో కలసి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఈసెట్, ఎంసెట్, పీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీలాసెట్, పీజీఈసెట్ నిర్వహణ తేదీలను కూడా ప్రకటించారు. మే 2వ తేదీన ఈసెట్‌తో ప్రవేశ పరీక్షలు ప్రారంభం అవుతాయని, అదే నెలలో అన్ని కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను పూర్తి చేస్తామని తెలిపారు. జూలై నెలాఖరులోగా అన్ని కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలను పూర్తి చేస్తామని, ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని వివరించారు. ఆయా కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన ఇంటర్మీడియట్ ఫలితాలు సకాలంలోనే వస్తుండగా, డిగ్రీ కోర్సుల పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించి, ఫలితాలు వెల్లడించేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలకు లేఖలు రాస్తామని వివరించారు. గతంలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలు (లాసెట్ ద్వారా) ఆలస్యం కాగా, న్యాయ విద్య కాలేజీలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మూడేళ్లకు అనుబంధ గుర్తింపు నేపథ్యంలో ఈసారి వాటిని కూడా సకాలంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

అభ్యర్థులను బట్టి సెషన్స్ :ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్యను బట్టి సెషన్ల సంఖ్య ఉంటుందని పాపిరెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామన్నారు. ఇంజనీరింగ్ ఎంసెట్‌ను 5 సెషన్లలో నిర్వహిస్తామని, ఒక్కో సెషన్‌లో 50 వేల మందికి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. గతేడాది ఇంజనీరింగ్ ఎంసెట్‌కు 1,42,210 మంది దరఖాస్తు చేసుకున్నారని, దాన్ని బట్టి ఈసారి 1.5 లక్షల్లోపు దరఖాస్తులు వస్తే 6 సెషన్లలో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహిస్తామని చెప్పారు. అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 9, 11 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్‌ను అభ్యర్థుల సంఖ్యను బట్టి 3 లేదా 4 సెషన్లలో నిర్వహిస్తామన్నారు. ఎడ్‌సెట్‌కు దరఖాస్తులు 50 వేలు దాటితే 23తోపాటు 24న కూడా నిర్వహిస్తామని చెప్పారు. గతేడాది ఈ సెట్స్ నిర్వహించిన యూనివర్సిటీలకే ఈసారి కూడా బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. సెట్స్ కన్వీనర్లను త్వరలోనే నియమిస్తామన్నారు.

నిమిషం నిబంధన యథాతథం..ఎంసెట్ తదితర సెట్స్ నిర్వహణలో నిమిషం నిబంధన యథావిధిగా ఉంటుందని పాపిరెడ్డి చెప్పారు. ఎంసెట్ అనేది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్ష కాబట్టి విద్యార్థులు పరీక్ష సమయం కంటే గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. వికలాంగులకు పరీక్ష ఫీజు తగ్గింపు అంశాన్ని ఆయా సెట్స్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్చిలో సెట్స్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని తెలిపారు.

ఈసారి నేషనల్ పూల్ లేదు..ఇంజనీరింగ్‌లో ప్రవేశాలను జాతీయ స్థాయి పరీక్ష ద్వారానే చేపట్టాలన్న నిబంధన ఈసారి లేదన్నారు. రాష్ట్ర సెట్స్ ద్వారానే ప్రవేశాలు చేపడతామన్నారు. ఒకవేళ కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే జేఈఈ మెయిన్ ద్వారానే అన్ని రాష్ట్రాల్లో ప్రవేశాలు చేపట్టాలని తప్పనిసరి చేస్తే దాన్ని అమలు చేస్తామన్నారు. అయితే ఏడాది ముందుగానే ఆ విషయం తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

2020 మే నెలలో నిర్వహించే సెట్స్ తేదీలు :
తేదీ
సెట్
నిర్వహణ యూనివర్సిటీ
2
ఈసెట్
జేఎన్టీయూ(హెచ్)
5 ,6, 7
ఎంసెట్
జేఎన్టీయూ(హెచ్) (ఇంజనీరింగ్)
9, 11
ఎంసెట్
జేఎన్టీయూ(హెచ్) (అగ్రికల్చర్)
13 నుంచి
పీఈసెట్
మహత్మాగాంధీ యూనివర్సిటీ
20, 21
ఐసెట్
కాకతీయ యూనివర్సిటీ
23
ఎడ్‌సెట్
ఉస్మానియా యూనివర్సిటీ
25
లాసెట్
ఉస్మానియా యూనివర్సిటీ
25
పీజీ లాసెట్
ఉస్మానియా యూనివర్సిటీ
27 నుంచి 30 వరకు
పీజీఈసెట్
ఉస్మానియా యూనివర్సిటీ

No comments:

Post a Comment