593 పోస్టులతో గ్రూప్-2 అనుబంధ ప్రకటన విడుదల
* మొత్తం 1032 పోస్టులకు నవంబరు 12, 13 తేదీల్లో పరీక్ష* కొత్తగా డిగ్రీ పాసైనవారు పాత పోస్టులకు అనర్హులు
* పాత దరఖాస్తుదారులు మళ్ళీ చేయనక్కర్లేదు
ఈనాడు, హైదరాబాద్: పేజీలకు పేజీలు సుదీర్ఘ సమాధానాలు రాయాల్సిన పన్లేదు...మౌఖిక పరీక్షల ఆందోళనా అక్కర్లేదు...ప్రిలిమ్స్... మెయిన్స్‌లాంటి అంచెలంచెల బాధలూ లేవు...ఉన్నదల్లా ఒకే ఒక పరీక్ష!
అదీ ఆబ్జెక్టివ్ పద్ధతిలో! ఇచ్చిన సిలబస్‌ను చక్కగా చదువుకొని... ఇచ్చిన నాలుగు సమాధానాల్లో సరైన వాటికి టక్కుమని టిక్కులు పెడితే చాలు. ఏదైనా డిగ్రీ అర్హతతో... మున్సిపల్ కమిషనర్లు కావొచ్చు... డిప్యూటీ తహసీల్దార్లుగా రావొచ్చు... అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ అధికారులవ్వొచ్చు... సబ్‌రిజిస్ట్రార్లుగా చేరొచ్చు... లేదంటే సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా కూర్చోవచ్చు. ప్రతి ఉద్యోగార్థీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసి, తమ అదృష్టం పరీక్షించుకోవాలనుకునే గ్రూప్-2 పరీక్షకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు తెరదింపింది. ఒకటి కాదు రెండు కాదు... వందకాదు... ఏకంగా 1032 పోస్టులు. పాత 439 పోస్టులకు అదనంగా మరో 593 పోస్టులను జతచేస్తూ మొత్తం 1032 గ్రూప్-2 కొలువులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గురువారం అనుబంధ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం అర్ధరాత్రి (సెప్టెంబరు 2) నుంచి ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకోవటానికి ఈనెల (సెప్టెంబరు) 23 చివరి తేదీ! దరఖాస్తుకు ముందు అభ్యర్థులు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 12, 13 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. వయసు దాటితే వాటికి మాత్రమే.... * 2015లో 439 పోస్టులకు విడుదలైన ప్రకటనకు దరఖాస్తు చేసిన అర్హులైన అభ్యర్థులు ఇప్పుడు మళ్ళీ అదనపు పోస్టులకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారి పాత దరఖాస్తులనే కొత్తవాటికి కూడా పరిగణనలోకి తీసుకుంటారు. * కొత్తగా ఈ ఏడాది (2015, డిసెంబరు 30 తర్వాత) డిగ్రీ పాసైనవారు పాత నోటిఫికేషన్ పోస్టులకు అర్హులు కారు. * అలాగే... 2015 జులై 1నాటికి కనీస వయసు 18 సంవత్సరాలు (సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2 పోస్టుకైతే 20 ఏళ్ళు) నిండనివారు పాత నోటిఫికేషన్‌లోని పోస్టులకు అర్హులు కారు. * పాత నోటిఫికేషన్ కటాఫ్ తేదీ తర్వాత గరిష్ఠ వయోపరిమితి (సాధారణ కేటగిరీకైతే 44 సంవత్సరాలు) దాటినవారు కొత్త పోస్టులకు అర్హులు కారు. కేవలం పాత పోస్టులకు మాత్రమే అర్హులవుతారు. ఉదాహరణకు... 2015 జులై 1 తర్వాత 44 సంవత్సరాలు దాటిన వారు (ఎక్సైజ్ కానిస్టేబుళ్ళకైతే 28 సంవత్సరాలే) తాజాగా జతచేసిన 593 పోస్టులకు అర్హులు కారు. * పరీక్ష విధానం, సిలబస్, జోన్లవారీగా ఖాళీల వివరాలు, అర్హతలు, తదితర పూర్తివివరాలన్నింటినీ టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అత్యధిక పోస్టులున్నవి:
ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు-284
డిప్యూటీ తహసీల్దార్లు - 259
అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు- 156 * దరఖాస్తుల స్వీకరణ- నేటి (శుక్రవారం, 2వ తేదీ) అర్ధరాత్రి నుంచి * దరఖాస్తులకు తుది గడువు - ఈనెల 23 (ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి) * పరీక్ష తేదీలు- నవంబరు 12, 13
No comments:
Post a Comment