Friday 22 April 2016

కానిస్టేబుల్‌ అర్హత పరీక్ష రేపే.....

* అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు
* ఎస్ఎంఎస్‌తో పరీక్ష కేంద్రానికి మార్గదర్శనం

ఈనాడు, హైదరాబాద్: ఎస్సై ప్రాథమిక రాతపరీక్ష అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆదివారం(ఏప్రిల్ 24) జరగబోయే కానిస్టేబుల్ పరీక్షకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఐదు లక్షల మందికిపైగా హాజరవుతున్న ఈ పరీక్షలలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 9281 కానిస్టేబుల్, ఫైర్‌మెన్ ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఈనెల 24న (ఆదివారం) ప్రాథమిక రాత పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 1132 కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు 5.36 లక్షల మంది హాజరవుతున్నారు. గత ఆదివారం అంటే 17వ తేదీ ఎస్సై పరీక్షలకు రాత పరీక్ష నిర్వహించినప్పుడు అభ్యర్థుల నుంచి వేలిముద్రలు తీసుకునే బయోమెట్రిక్ యంత్రాలు కొన్ని చోట్ల మొరాయించాయి. దాంతో పరీక్ష పూర్తయిన తర్వాత కూడా అభ్యర్థులను కేంద్రంలోనే ఉంచి మరీ వేలిముద్రలు తీసుకోవాల్సి వచ్చింది. అలానే కొన్ని పరీక్ష కేంద్రాల చిరునామాల విషయంలోనూ అభ్యర్థులు కొంత సందిగ్ధతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ పరీక్షలకు గంట ముందుగానే వేలిముద్రలు తీసుకోవాలని నిర్ణయించారు. పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల మధ్య జరుగుతుంది. ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్ష రాయనివ్వరు. గంట ముందుగానే అభ్యర్థులను అనుమతిస్తారు కాబట్టి అప్పటి నుంని వేలిముద్రలు తీసుకోవడం మొదలుపెడతారు. వేలిముద్రలతోపాటు ఫొటో కూడా తీసుకుంటారు. తదుపరి జరిగే దేహదారుఢ్య, తుది పరీక్షలప్పుడు వీటిని వాడుకుంటారు. ఇక చిరునామా విషయంలో ఎస్సై పరీక్షలప్పుడే 'ఫైండ్‌మీ అనే యాప్‌ను రూపొందించారు. అభ్యర్థి దరఖాస్తు నెంబరు ఆధారంగా ఈ యాప్ వారివారి ఫోన్లలోకి దిగుమతి అవుతుంది. రిజిస్ట్రేషన్ నెంబరు ఆధారంగా వారి పరీక్ష కేంద్రం ఎక్కడనేది మ్యాప్‌లో చూపిస్తుంది. దాని ఆధారంగా సదరు అభ్యర్థి వారివారి పరీక్ష కేంద్రానికి చేరుకోవచ్చు. దీనికి అదనంగా ఇప్పుడు మరికొన్ని ఏర్పాట్లు చేశారు. స్మార్ట్‌ఫోన్ లేని అభ్యర్థులు 9222273310 నెంబరుకు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా హాల్‌టిక్కెట్ నెంబరు ఎస్ఎంఎస్ పంపిస్తే, ఆ అభ్యర్థికి కేటాయించిన పరీక్ష కేంద్రం చిరునామా వచ్చేస్తుంది. దాంతోపాటు మ్యాప్ ద్వారా దారి చూపడానికి లింక్ కూడా వస్తుంది. అలానే గూగుల్ మ్యాప్‌లలో పరీక్ష కేంద్రం పిన్‌కోడ్ క్రోడీకరించడం ద్వారా కూడా చిరునామా వివరాలు తెలుసుకోవచ్చు. ప్రాచుర్యంలో ఉన్న విద్యాసంస్థల్లోనే ఈ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే చూసుకొని రావడం మంచిదని పోలీసు నియామక మండలి ఛైర్మన్ పూర్ణచంద్రరావు తెలిపారు.

No comments:

Post a Comment