Tuesday, 22 March 2016

ఇక నుండి మా గ్రామస్థులం ఎవ్వరం కట్నం తీసుకోం.................?

అక్కడ వరకట్నం నేరం...........!

అక్కడ వరకట్నం నేరం
       ఆఊరి పేరు సిద్దార్థ్‌ నగర్‌, ఉత్తర ప్రదేశ్‌లో ఉంది. ఆ గ్రామంలో కట్నం తీసుకోవడం నిషేధం. నిషేధం అంటే ఏదో మొక్కుబడిగా కాదు. కట్నం తీసుకున్న ఫ్యామిలీ మొత్తాన్ని నిర్దాక్షిణ్యంగా గ్రామం నుండి బహిష్కరిస్తారు. ఇందులో ఏ కులం వారికైనా ఎటువంటి మినహాయింపు లుండవు. వరకట్న సమస్యను పూర్తిగా రూపుమాపడానికి ఆ గ్రామ ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
'ఇక నుండి మా గ్రామస్థులం ఎవ్వరం కట్నం తీసుకోం' అంటూ ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈ విప్లవాత్మక నిర్ణయానికి కారణం చదువుకున్న యువత. వీరు 'అంజుమన్‌ రజా ఇ-ముస్తఫా' అనే సంస్థ ఆధ్వర్యంలో వరకట్న సమస్యను అంతం చేయడానికి అడుగు ముందుకేశారు. వీరి బాటలోనే అక్కడి ిస్థానికులు, గ్రామ ప్రజలంతా నడుస్తున్నారు. 
ఇక్కడ వరకట్నం ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు పెళ్లి సమయంలో దుబారా ఖర్చులు చేసినా, ఆర్భాటాలకు పోయి ఎక్కువ మొత్తంలో పెళ్లికి ఖర్చు పెట్టినా కూడా నేరమే. మేము వీటికి వ్యతింకం అంటూ ప్రతిజ్ఞ చేయించారు.ఈ నిర్ణయానికి కట్టుబడి, పెళ్లి ఖర్చులు తగ్గించుకుంటున్నారు ఆ గ్రామస్థులు.
ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉందట. వరకట్నం కారణంగా గత మూడు సంవత్సరాలలో 24,771 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌ లోనే 7,048 మరణాలు సంభవించాయి. ఆడపిల్లల ప్రాణాలు తీస్తున్న ఈ వరకట్న సమస్యను అంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు అక్కడి యువత.
ఆడపిల్ల పుట్టగానే ఖర్చులు ఎక్కువని, పెద్దయ్యాక పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని చాలా బరువు బాధ్యతలున్నాయని, భూమి మీద పడ్డ మరుక్షణం నుండీ చాలామంది ఆడపిల్లను భారంగానే చూస్తున్నారు.
ఆడపిల్లకు చదువెందుకని పెళ్ళికి ప్రాధాన్యత ఇవ్వడం, మగపిల్లల కంటే తక్కువగా చదివించడం ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఆడపిల్లను తక్కువగా చేస్తూ, చులకనగా చూస్తున్నారు. 
ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్ల కుటుంబానికి రాకూడదని, వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం తప్పుగా భావిస్తూ ఇక్కడ వరకట్నంను రూపుమాపారు. ఇక్కడ 120 ముస్లిం కుటుంబాలు, 80 హిందూ కుటుంబాలు ఉన్నాయి. తమ పిల్లలను ఎటువంటి ఒత్తిడులు లేకుండా సంతోషంగా చదివించుకుంటూ, వరకట్నం, అమ్మాయి పెళ్లి గురించి మాకెటువంటి భయంలేదంటూ గర్వంగా చెబుతున్నారు ఈ గ్రామస్థులు. 
దేశంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలు ఇలాంటి ప్రతిన బూని ఆడపిల్లలను చదివించి, వారి అభివృద్దికి తోడ్పడితే ఎంతో బాగుంటుందని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది కదూ... 

మీసాలతో గిన్నిస్ రికార్డు

వామ్మో.. ఎంత పెద్ద మీసాలో..!


ramsingh
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రామ్‌సింగ్ చౌహాన్. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఈయన మీసాలతో గిన్నిస్ రికార్డులకెక్కారు. 17ఏండ్ల వయసు నుంచి రామ్‌సింగ్ తన మీసాలను పెంచుతూ వస్తున్నారు. అంటే.. అప్పటినుంచి అసలు మీసాలను షేవ్ చేయడం లేదన్నమాట! ఇప్పుడు ఆయనకు 64ఏండ్లు. మీసాల పొడవు 5.8 మీటర్లు (18.6 అడుగులు). ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇలా తన మీసాల విశ్వరూపాన్ని చూపిస్తూ మీడియాకు పోజిచ్చారు.

Monday, 21 March 2016

తులసి వల్ల మనకు కలిగే లాభాలేంటో తెలుసుకుందామా..?!

పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చనే మాటలు అక్షర సత్యాలనవచ్చు. ఎందుకంటే తులసిలో ఉండే ఔషద గుణాలు సకల రోగాలను నివారిస్తాయి కాబట్టి. ఆరోగ్యపరంగా, సౌందర్యపరంగా తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. లక్ష్మి తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలుగా పిలువబడే ఈ తులసి వల్ల మనకు కలిగే లాభాలేంటో తెలుసుకుందామా..?!
 
మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు తులసి ఆకులతో తయారు చేసిన కషాయం తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఈ ఆకులతో ఆవిరి పట్టినా, వాసన చూసినా మంచి ప్రభావం కనిపిస్తుంది. ఇలా చేయడాన్నే ఆరోమా థెరపీ అంటారు.
 
నీడన ఆరబెట్టిన తులసి ఆకులను పొడి చేసి, ఒక టీస్పూన్ పొడికి, చిటికెడు సైంధవలవణం చేర్చి పళ్ళు తోముకుంటే పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యల్ని నివారించుకోవచ్చు. తులసి రసంలో కాస్త నిమ్మరసం కలిపి రాసుకుంటే చర్మ సంబంధ సమస్యలు మటుమాయమవుతాయి.
 
తులసి ఆకుల పొడిని పెసరపిండిలో కలిపి ఒంటికి రాసుకొని స్నానం చేస్తే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. మొటిమలు తొందరగా తగ్గుతాయి. తులసి ఆకుల కషాయం జ్వరం తీవ్రతను తగ్గిస్తుంది.
 
తులసి కషాయంలో ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే, జ్వరంతో బాధపడేవారి అధిక దాహం సమస్యను నివారిస్తుంది. వీటి ఆకులతో అవిరి పడితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి కషాయం, అల్లం రసం సమపాళ్ళలో కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.
 
ఏడాది నిండిన పిల్లలకు రోజూ ఒక చెంచా తులసి రసం తాగిస్తే జీర్ణ శక్తి పెరుగుతుండి. పిల్లలకు తరచూ జలుబు, దగ్గు, జ్వరాలు రాకుండా కాపాడుకోవచ్చు. కళ్ళు మండుతున్నా, ఎరుపెక్కినా కషాయం పలుచగా చేసి కళ్ళు కడిగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

ప్ర‌పంచంలోనే అతి ఖ‌రీదైన మొబైల్ ఫోన్

ఈ మొబైల్... హెలికాప్ట‌ర్ క‌ంటే కాస్ట్లీ గురూ....



ప్ర‌పంచంలోనే అతి ఖ‌రీదైన మొబైల్ ఫోన్ ఇది. దీని ఖ‌రీదు ఒక హెలికాప్ట‌ర్ క‌న్నా ఎక్కువ‌. ఫాల్క‌న్ సూప‌ర్ నోవా డైమండ్ ఐ ఫోన్-6 మోడ‌ల్ ఫోన్ ఇది. దీని ధ‌ర 45.55 కోట్ల డాల‌ర్లు. అంటే మ‌న క‌రెన్సీలో 300 కోట్ల రూపాయ‌లు. ఐఫోన్ సిక్స్‌కు ఉండే అన్ని ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. 
IPhone
 
కాక‌పోతే ఇంత ఖ‌రీదు ఎందుకంటే... ఈ ఫోన్ వెనుక ఒక పింక్ డైమండ్ పొదిగి ఉంటుంది. అదే ఈ ఫోన్‌కు ఎట్రాక్ష‌న్. అమెరిక‌న్ ఆర్మీలో వాడే హెలికాప్ట‌ర్ బెల్-1వై వెనామ్ ఖ‌రీదు ఈ ఫోన్ క‌న్నా కొంచెం త‌క్కువే. ఈ హెలికాప్ట‌ర్ 4.5 కోట్ల డాల‌ర్లు. ఇంత కాస్ట్లీ ఫోన్ వాడాలంటే... వాళ్లెవ‌రో టాటా, బిర్లాలు కావాల్సిందే మ‌రి!

ఈరోజు ట్విట్టర్‌ పుట్టిన రోజు

న్యూయార్క్‌: ఆనందం, బాధ, ఆగ్రహం, శుభాకాంక్షలు, సంతాపాలు.. విషయం ఏదైనా భావాలను పంచుకోవడానికి గొప్ప వేదిక ట్విట్టర్‌. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, మదిలో ఏ ఆలోచన మెదిలినా, సెల్ఫీ దిగినా అందులో పోస్ట్‌ చేయాల్సిందే. సెలబ్రిటీలు, రాజకీయనాయకులను అభిమానులను మరింత దగ్గర చేస్తున్న వేదిక ఇది. ఓ రకంగా చెప్పాలంటే సమాచార, ప్రసార మాధ్యమాన్నే మార్చేసింది ఈ ట్వీటు పక్షి. ఎంతో మందికి ట్విట్టర్‌ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తుటాం కదా.. ఈరోజు ట్విట్టర్‌ పుట్టిన రోజు మరి. హ్యాపీ బర్త్‌డే చెప్పేయండి మరి..
ట్విట్టర్‌ ఈరోజు పదో పుట్టినరోజు వేడుక జరుపుకొంటోంది. ఈ సందర్భంగా ట్విట్టర్‌ సరికొత్త హ్యాష్‌ట్యాగ్‌ ఎమోజీని ప్రవేశపెట్టింది. వినియోగదారులు ట్విట్టర్‌పై తమకున్న ప్రేమను వ్యక్తపరిచేందుకు లవ్‌ట్విట్టర్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌కు హృదయాకారం, ట్విట్టర్‌ బర్డ్‌ చిత్రాలతో కొత్త ఎమోజీలను జతచేర్చింది.

పదేళ్ల క్రితం మార్చి 21న ట్విట్టర్‌ ఒక ట్వీట్‌తో తన ప్రయాణం ప్రారంభించింది. అమెరికాలో ప్రారంభమై ప్రపంచమంతా చుట్టేస్తున్నామని.. ట్విట్టర్‌ ప్రారంభించి పదేళ్లు అయిన సందర్భంగా సంస్థ వినియోగదారులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఓ వీడియోను పోస్ట్‌ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌ వినియోగదారులు రోజుకు 500 మిలియన్‌ ట్వీట్లు.. ఏడాదికి 200 బిలియన్ల ట్వీట్లు చేస్తున్నారు. పదేళ్ల క్రితం మార్చి 21న ఒకే ఒక్క ట్వీట్‌తో ప్రయాణం మొదలుపెట్టాం. అప్పటి నుంచి ప్రతి క్షణంలో ప్రజలు తమ భావాలను ట్విట్టర్‌తో పంచుకుంటున్నారు అని ట్విట్టర్‌ ఆనందం వ్యక్తంచేస్తోంది.

Holi Special*~*~*~*


1G, 2G, 3G, 4G, 5G.. . . . . . ?


టెక్నాలజీ రోజు రోజుకు ముందుకు దూసుకుపోతోంది. దానికి తగ్గట్లుగానే 1జీ, 2జీ, 3జీ అంటూ ఒక్కో జనరేషన్ అమితవేగంతో ముందుకు దూసుకొస్తోంది.ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే 4జీ పూర్తి స్థాయిలో రానే లేదు..ఇప్పుడు 5జీ అంటూ ప్రపంచం ఉరుకులు పరుగులు పెడుతోంది. అసలింతకీ ఏంటీ ఈ నెట్‌వర్క్‌లు.. ఈ జనరేషన్‌లు.. వీటివల్ల ఉపయోగాలు ఏంటీ.. అవి ఎలా పనిచేస్తాయి.. అసలు జీ అంటే ఏమిటీ..


ఓ తరానికి మరో తరానికి మధ్య ఉన్న తేడా జీ అంటే జనరేషన్ అని అర్థం. కుప్తంగా చెప్పాలంటే ఓ తరానికి మరో తరానికి మధ్య ఉన్న తేడాను తెలుపుతుంది.టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ జనరేషన్ మారుతూ వస్తూ ఉంటుంది.

మొదటి తరం (1G ) 1980- 19990 మధ్య కాలం ఈ జనరేషన్ అంతా మీకు అన్ లాగ్ పద్దతిలో ఉంటుంది. అంటే మీరు సిగ్నల్స్ పంపించడం కాని అలాగే తీసుకోవడం కాని మొత్తం అన్‌లాగ్ పద్దతే.. ఈ జనరేషన్‌లోని డేటాలో మీరు కాల్ అలాగే టెక్ట్స్ మెసేజ్ మాత్రమే పంపే వీలుంటుంది

మొదటి తరం (1G ) 1980- 19990 మధ్య కాలం 1980- 19990 మధ్య కాలంలో ఈ జనరేషన్ పనిచేయడం ప్రారంభించింది. దీని వేగం దాదాపు 2.4 kbps వరకు ఉంటుందని అంచనా.. అయితే ఈ జనరేషన్ లో ఫోన్ లో ధ్వని తక్కువ కావడం అలాగే ఫోన్ సైజు చాలా పెద్దదిగా ఉండటంతో పాటు పరిమిత మైన సేవలు ఉండేవి

రెండవ తరం (2G) 1991 ఈ జనరేషన్ మొట్టమొదటగా ఫిన్ ల్యాండ్ లో ప్రారంభమైంది. ఈ దశలో సిగ్నల్స్ అనేవి డిజిటల్ రూపంలో ఉండేవి కాబట్టి మీరు కాల్స్ అలాగే డేటానే ఎక్కడికైనా సులభంగా పంపుకునే వీలు ఉండేది. ఈ 2జీ నెట్ వర్క్ ఉన్న ఫోన్ ని మీరు ప్రపంచంలో ఏ దేశంలోనైనా వాడుకునే వీలుంది.

రెండవ తరం (2G) 1991 ఇలా వాడుకోవాలంటే రోమింగ్ ఛారీలు చెల్లించాల్సి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇవే మొదటి తరం ఫోన్లు అని చెప్పవచ్చు. వీటి సరాసరి వేగం 64 kbps.అయితే ఈ జనరేషన్లో వీడియో మెసేజ్ లకు ఛాన్స్ లేదు.

మూడవ తరం (3G) ఇది అసలైన జనరేషన్..ఇక్కడి నుంచే అసలైన యుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. సెల్ ఫోన్లతో ఇంటర్నెట్ వాడుకునే అవకాశం ఈజనరేషన్ నుంచే వచ్చింది. ఈ జనరేషన్ లో సెల్ ఫోన్లు మాత్రమే కాదు ట్యాబ్లెట్లు కూడా రావడం మొదలయ్యాయి. డేటా స్పీడు 144 Kbps to 2mbps వరక ఉంటుంది

మూడవ తరం (3G) ఈ జనరేషన్ లోనే మనకు వీడియో కాలింగ్ , వాయిస్ కాలింగ్ , ఫైల్ ట్రాన్సిమిషన్ ,ఇంటర్నెట్ సెర్చింగ్ ,ఆన్ లైన్ టీవీ ఇంకా గేమ్స్ అన్ని రకాల సౌలభ్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పుడూ ఇంటర్నెట్ సౌలభ్యం ఉన్నవారికి 3జీ అనేది ఓ వరం లాంటిదనే చెప్పవచ్చు.

నాలుగవ తరం (4G) ఇది ఓ మ్యాజిక్ లాంటిది. 3జీ ఓవరమయితే ఇది అంతకుమించిన పెద్ద వరం. 3జీలో డాటా ట్రాన్సఫర్ కన్నా 4జీలో చాలా ఫాస్ట్ గా అవుతుంది. అక్కడ 144 Kbps to 2mbps ఉంటే అది 4జీకి వచ్చేసరికి 100 mbps నుంచి 1Gbps వరకు వచ్చింది.

నాలుగవ తరం (4G) దాదాపు చాలాదేశాల్లో ఈ నాలుగవ తరం వాడుకలోకి వచ్చింది. అయితే ఈ జనరేషన్లో ఫోన్ బ్యాటరీ దెబ్బకు అయిపోతుంది. మీరు అన్ని రకాల సదుపాయాలు వాడుకునే వీలుంది కాని..హీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండదు..క్లుప్తంగా చెప్పాలంటే ఇదొక మొబైల్ బ్రాండ్ అంతే..దీని వేగం చాలా ఎక్కువ కాబట్టి బ్యాటరీ కూడా అంతే వేగంతో అయిపోతుంది.
ఐదవ తరం (5G) ఈ తరం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాలనిపిస్తుంది. దీనికి అసలు హద్దులే లేవు. ఇది పూర్తిగా వైర్ లెస్ టెక్నాలజీతో కూడుకున్నది. 4జీ httpని సపోర్ట్ చేస్తే 5G WWWW Wireless World Wide webకు కూడా సపోర్ట్ చేస్తుంది.
2జీ- 3జీ మధ్యలో ఓ తరం మీకు తెలియకుండా 2జీ -3జీ మధ్యలో ఓ తరం ఉంది. అదే 2. 5జీ ఈ తరంలో చాలా తక్కువ స్థాయిలో ఫోన్లు రేడియో తరంగాల ద్వారా పనిచేయడం ప్రారంభించాయి. ఈతరం నుంచే మనకు జేబులో పట్టే ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ వేగం 64 kbps నుండి 144 kbps వరకు పెరిగింది.

Saturday, 19 March 2016

విశ్వంలో...........వింత గ్రహం

-అంతరిక్ష కక్ష్యలో అసహజరీతిలో ప్రయాణం
planets
లాస్ ఏంజెలెస్, మార్చి 19: సౌరవ్యవస్థ వెలుపల అసాధారణ లక్షణాలున్న వింత గ్రహాన్ని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గతంలో ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా ఉన్న ఈ గ్రహం అసహజరీతిలో కక్ష్యలో తిరుగున్నదనే విషయాన్ని గుర్తించారు. అంతేకాకుండా ఈ గ్రహం నుంచి వెలువడే కాంతి ఆకస్మాత్తుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్టు గ్రహించారు. ఈ గ్రహ ప్రవర్తన తీరు తోకచుక్కను పోలివుందని పేర్కొన్నారు. భూమికి 117 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ వింత గ్రహాన్ని హెచ్‌డీ 20782గా వ్యవహరిస్తున్నారు. 

సాధారణంగా సౌర వ్యవస్థలో గ్రహాలు దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతుంటాయని, ఇందుకు భిన్నంగా సౌరవ్యవస్థ వెలుపల ఉన్న కొన్ని గ్రహాల కక్ష్య అసాధారణంగా ఉన్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. కక్ష్యకు దూరంగా వెళ్లడమే కాకుండా, చాలా దూకుడు స్వభావంతో వేగంగా ప్రయాణిస్తునే విషయాన్ని తెలుసుకున్నారు. దీని కక్ష్య తీరు దీర్ఘవృత్తాకారంలో కాకుండా ఒడిసెలతో విసిరిన రాయిలా ప్రయాణిస్తున్నదని వెల్లడించారు. ఈ గ్రహాన్ని పరిశీలించిన తర్వాత.. ఇలాంటి లక్షణాలు గ్రహాలు సౌరవ్యవస్థలో లేవని నిర్ధారణకు వచ్చామని శాన్‌ఫ్రాన్సిస్కో వర్సిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ గ్రహానికి సంబంధించిన డాటాను నూతన పరిమితులతో శాటిలైట్ ఆధారిత టెలిస్కోప్ ద్వారా సేకరించారు.

పేద విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్


హైదరాబాద్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా వృత్తి విద్యాధికారి పి.సుకీర్తి తెలిపారు. జిల్లా వృత్తి విద్యాధికారి ఆధ్వర్యంలోనే ఉచిత ఎంసెట్ కోచింగ్ నిర్వహణ ఉంటుందని చెప్పారు. అబ్బాయిలకు బాగ్‌లింగంపల్లిలోని డా.బి.ఆర్.అంబేద్కర్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో, బాలికలకు నృపతుంగ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత కళాశాలల్లో ప్రిన్సిపాల్‌ను గానీ, గన్‌ఫౌండ్రీ వద్ద గల జిల్లా వృత్తి విద్యాధికారి కార్యాలయంలో గానీ సంప్రదించాలని ఆమె సూచించారు

నేడు ప్రపంచ ఊర పిచ్చుకల దినోత్సవం


హైదరాబాద్ : ప్రపంచ ఊరపిచ్చుకల దినోత్స వం సందర్భంగా ఆదివారం చార్మినార్ నుంచి జూపార్కు వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు క్యూరేటర్ సుభద్రదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ, పరిరక్షణ దళం ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటలకు చార్మినార్ నుంచి సైకిల్, బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. అనంతరం ర్యాలీ జూ లోని వివిధ ప్రాంతాలకు వెళ్తుందన్నారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. అదే విధంగా జూ సందర్శనకు వచ్చే వారందరికీ ఊర పిచ్చుకలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె చెప్పారు.