Wednesday, 6 October 2021

1,800 కేంద్రాల్లో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు...?

 ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ పరీక్షలు సరళతరంగానే ఉంటాయని ఇంటర్‌ బోర్డ్‌ అధికారులు చెబుతున్నారు. అన్నివైపుల నుంచి వస్తున్న ఒత్తిడి, విద్యార్థుల ఆందోళనను పరిగణనలోనికి తీసుకుని కొంత మానవీయకోణంలోనే వెళ్తున్నామని అంటున్నారు. ఐచ్ఛిక(మల్టీపుల్‌ చాయిస్‌) ఎక్కువ, సిలబస్‌ 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రం రూపొందించినట్టు ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. కొద్దోగొప్పో ఇంటర్‌ సబ్జెక్టులు అవగాహన చేసుకున్నవారికి ఈ పరీక్ష ఎంతమాత్రం కఠినం కాబోదన్నారు.


సైన్స్‌ విద్యార్థుల ప్రాక్టికల్స్‌ విషయంలోనూ కొంత సానుకూల ధోరణితోనే ఉండే వీలుందని అధికార వర్గాల సమాచారం. ప్రాక్టికల్స్‌ నిర్వహించే కాలేజీల్లో కోవిడ్‌ మూలంగా ప్రయోగశాలలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని బోర్డు గుర్తించింది. ఈ కారణంగా మౌఖిక ప్రశ్నలతో విద్యార్థుల సృజనాత్మకతను రాబట్టే ప్రయత్నం చేయాలని క్షేత్రస్థాయిలో అంతర్గత ఆదేశాలు ఇచ్చినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు.


గతేడాది ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థులకు కోవిడ్‌ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. దాదాపు 4.75 లక్షల మందిని ఉత్తీర్ణులుగా గుర్తించి, ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్‌ చేశారు. కానీ, రెండో ఏడాదీ పరీక్షలు నిర్వహించని పరిస్థితి తలెత్తితే అది సమస్యగా అవుతుందని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు ఈ నెల 25 నుంచి పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించని పక్షంలో మొదటి ఏడాది మార్కులనే కొలమానంగా తీసుకోవచ్చని భావిస్తున్నారు. 


సిలబస్‌ సింపుల్‌..

ఫస్టియర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు బోర్డ్‌ ఇప్పటికే మోడల్‌ ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచింది. 70 శాతం సిలబస్‌లోని పాఠాల్లో తేలికైన, విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా అర్థమైన వాటినే గుర్తించారు. వీటిని ఎంపిక చేయడం కోసం నిపుణులైన అధ్యాపకుల సలహాలు కూడా తీసుకున్నారు. మెజారిటీ విద్యార్థులు తేలికగా సమాధానం ఇవ్వగల పాఠ్యాంశాలను ప్రశ్నపత్రం కూర్పుకు తీసుకునేలా ఏర్పాటు చేసినట్టు బోర్డ్‌ పరీక్షల నిర్వహణ విభాగం అధికారి ఒకరు చెప్పారు.

ఇందులో కూడా మల్టిపుల్‌ చాయిస్‌ను ఈసారి ఎక్కువగా పెడుతున్నారు. ఒక ప్రశ్న కష్టమనుకుంటే, తేలికైన మరో ప్రశ్నకు జవాబు ఇచ్చే వెసులుబాటు 90 శాతం విద్యార్థులకు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సైన్స్‌ విద్యార్థులకు ఈ విధానం సులభతరమవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్, మేథమెటిక్స్‌ విద్యార్థులకు ప్రయోజనకరమని అధ్యాపకవర్గాలు చెబతున్నాయి. ఎకనమిక్స్‌లోనూ ఛాయస్‌ ఉండటం వల్ల తేలికగా పరీక్ష పాసయ్యే వీలుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. 


రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,800 కేంద్రాల్లో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించబోతున్నారు. పరీక్ష మొదలుకొని, మూల్యాంకనం పూర్తయ్యే వరకూ కాలేజీ అధ్యాపకులే కీలకపాత్ర పోషిస్తారు. అధ్యాపకుల కొరత వల్ల ప్రస్తుతం ఫస్టియర్‌లో ఉన్నవాళ్లే కాకుండా, సెకండియర్‌ చదువుతున్న పరీక్షార్థులు కూడా ఇబ్బందిపడవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ద్వితీయ సంవత్సరం మధ్యలో ఉన్న విద్యార్థులు మరోవైపు జాతీయ, రాష్ట్రీయ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.


పరీక్ష పూర్తయిన తర్వాత యథావిధిగా ఇంటర్‌ క్లాసులు జరుగుతాయని, ఫస్టియర్‌ రాసే విద్యార్థులు పరీక్షల అనంతరం ఎప్పటిలాగే క్లాసులకు హాజరవ్వొచ్చని చెబుతున్నారు. మూల్యాంకనం చేసే అధ్యాపకులు కూడా వారి సబ్జెక్టులను విధిగా బోధించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పక్కా ప్రణాళికతోనే ఇంటర్‌ బోర్డు ముందుకెళ్తోందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

No comments:

Post a Comment