Wednesday, 6 October 2021

డీఈఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం

డీఈఈ సెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల7 (గురువారం) నుంచి 9వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ పరీక్షలో మొత్తం 3,911 మంది ఉత్తీర్ణులయ్యారు. 

వారు రాష్ట్రంలోని 10ప్రభుత్వ డైట్లలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. 


పూర్తి వివరాలను వెబ్ సైట్ నుంచి పొందొచ్చు.

http://deecet.cdse.telangana.gov.in/TSDEECET/TSDEECET_HomePage.aspx

నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీం అప్లై చేయండిలా...!!!

 కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి తాజా, పునరుద్ధరణ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నవంబర్‌ 30 వరకు ఉందని ఇంటర్‌ బోర్డు ప్రకటిం చింది. 

ఈ మేరకు బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 


దరఖాస్తుల కోసం 2020-21లో ఇంటర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ వర్తిస్తుందని తెలిపారు. ఇంతకు ముందు జాతీయ స్కాలర్‌షిప్‌ కోసం ఎంపికైన విద్యార్థులు 2021-22 విద్యాసంవత్సరానికి దరఖాస్తులను సమర్పించాలని కోరారు. 

తాజా, పునరుద్ధరణ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. 

విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. తాత్కాలికంగా ఎంపికైన విద్యార్థుల 81,594 మంది జాబితా వెబ్‌సైట్‌లో పొందుపరిచామని వివరించారు.

1,800 కేంద్రాల్లో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు...?

 ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ పరీక్షలు సరళతరంగానే ఉంటాయని ఇంటర్‌ బోర్డ్‌ అధికారులు చెబుతున్నారు. అన్నివైపుల నుంచి వస్తున్న ఒత్తిడి, విద్యార్థుల ఆందోళనను పరిగణనలోనికి తీసుకుని కొంత మానవీయకోణంలోనే వెళ్తున్నామని అంటున్నారు. ఐచ్ఛిక(మల్టీపుల్‌ చాయిస్‌) ఎక్కువ, సిలబస్‌ 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రం రూపొందించినట్టు ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. కొద్దోగొప్పో ఇంటర్‌ సబ్జెక్టులు అవగాహన చేసుకున్నవారికి ఈ పరీక్ష ఎంతమాత్రం కఠినం కాబోదన్నారు.


సైన్స్‌ విద్యార్థుల ప్రాక్టికల్స్‌ విషయంలోనూ కొంత సానుకూల ధోరణితోనే ఉండే వీలుందని అధికార వర్గాల సమాచారం. ప్రాక్టికల్స్‌ నిర్వహించే కాలేజీల్లో కోవిడ్‌ మూలంగా ప్రయోగశాలలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని బోర్డు గుర్తించింది. ఈ కారణంగా మౌఖిక ప్రశ్నలతో విద్యార్థుల సృజనాత్మకతను రాబట్టే ప్రయత్నం చేయాలని క్షేత్రస్థాయిలో అంతర్గత ఆదేశాలు ఇచ్చినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు.


గతేడాది ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థులకు కోవిడ్‌ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. దాదాపు 4.75 లక్షల మందిని ఉత్తీర్ణులుగా గుర్తించి, ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్‌ చేశారు. కానీ, రెండో ఏడాదీ పరీక్షలు నిర్వహించని పరిస్థితి తలెత్తితే అది సమస్యగా అవుతుందని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు ఈ నెల 25 నుంచి పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించని పక్షంలో మొదటి ఏడాది మార్కులనే కొలమానంగా తీసుకోవచ్చని భావిస్తున్నారు. 


సిలబస్‌ సింపుల్‌..

ఫస్టియర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు బోర్డ్‌ ఇప్పటికే మోడల్‌ ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచింది. 70 శాతం సిలబస్‌లోని పాఠాల్లో తేలికైన, విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా అర్థమైన వాటినే గుర్తించారు. వీటిని ఎంపిక చేయడం కోసం నిపుణులైన అధ్యాపకుల సలహాలు కూడా తీసుకున్నారు. మెజారిటీ విద్యార్థులు తేలికగా సమాధానం ఇవ్వగల పాఠ్యాంశాలను ప్రశ్నపత్రం కూర్పుకు తీసుకునేలా ఏర్పాటు చేసినట్టు బోర్డ్‌ పరీక్షల నిర్వహణ విభాగం అధికారి ఒకరు చెప్పారు.

ఇందులో కూడా మల్టిపుల్‌ చాయిస్‌ను ఈసారి ఎక్కువగా పెడుతున్నారు. ఒక ప్రశ్న కష్టమనుకుంటే, తేలికైన మరో ప్రశ్నకు జవాబు ఇచ్చే వెసులుబాటు 90 శాతం విద్యార్థులకు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సైన్స్‌ విద్యార్థులకు ఈ విధానం సులభతరమవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్, మేథమెటిక్స్‌ విద్యార్థులకు ప్రయోజనకరమని అధ్యాపకవర్గాలు చెబతున్నాయి. ఎకనమిక్స్‌లోనూ ఛాయస్‌ ఉండటం వల్ల తేలికగా పరీక్ష పాసయ్యే వీలుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. 


రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,800 కేంద్రాల్లో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించబోతున్నారు. పరీక్ష మొదలుకొని, మూల్యాంకనం పూర్తయ్యే వరకూ కాలేజీ అధ్యాపకులే కీలకపాత్ర పోషిస్తారు. అధ్యాపకుల కొరత వల్ల ప్రస్తుతం ఫస్టియర్‌లో ఉన్నవాళ్లే కాకుండా, సెకండియర్‌ చదువుతున్న పరీక్షార్థులు కూడా ఇబ్బందిపడవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ద్వితీయ సంవత్సరం మధ్యలో ఉన్న విద్యార్థులు మరోవైపు జాతీయ, రాష్ట్రీయ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.


పరీక్ష పూర్తయిన తర్వాత యథావిధిగా ఇంటర్‌ క్లాసులు జరుగుతాయని, ఫస్టియర్‌ రాసే విద్యార్థులు పరీక్షల అనంతరం ఎప్పటిలాగే క్లాసులకు హాజరవ్వొచ్చని చెబుతున్నారు. మూల్యాంకనం చేసే అధ్యాపకులు కూడా వారి సబ్జెక్టులను విధిగా బోధించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పక్కా ప్రణాళికతోనే ఇంటర్‌ బోర్డు ముందుకెళ్తోందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

బ్యాంకుల్లో 5,830 క్లర్క్ పోస్టులు



దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XI నోటిఫికేషన్‌ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) విడుదల చేసింది. 


ఈ ప్రకటన ద్వారా 5, 880 క్లరికల్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణలో 263, ఏపీలో 263 ఖాళీలు ఉన్నాయి. బీవోబీ, కెనరా, ఇండియన్ ఓవర్సీస్, యూకో, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్‌బీ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకుల్లోని

ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 


డిగ్రీ ఉత్తీర్ణులై, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారు ఈ నెల 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి..  2021 జూలైలోనే నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ స్థానిక భాషలకు సంబంధించిన కారణాలతో ఐబీపీఎస్ తిరిగి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. జూలైలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదు.

 

వివరాలకు

https://www.ibps.in లో చూడవచ్చు.