1. ఆర్థిక సంవత్సరం
భారత్‌లో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై, మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది.
2. వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి
ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు వ్యక్తిగత వార్షికాదాయానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంది.
3. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు
పౌరులు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు. ప్రత్యక్ష పన్నుల భారం ప్రజలపై నేరుగా పడుతుంది. ఆదాయపు పన్ను, సంపద పన్ను, కార్పొరేట్ పన్ను- ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణలు.
పరోక్ష పన్నుల భారం పౌరుడిపై నేరుగా పడదు. విలువ ఆధారిత పన్ను(వ్యాట్), అమ్మకం పన్ను, సేవా పన్ను, విలాస పన్ను, వినోద పన్ను తదితర పన్నుల స్థానంలో ప్రవేశపెట్టిన జీఎస్‌టీ- పరోక్ష పన్నులకు ఉదాహరణలు.
4. మూలధన లాభాలు
షేర్లు కొన్న తర్వాత ఏడాదిలోపు వ్యవధిలో వాటిపై ఆర్జించే లాభాలను స్వల్ప కాలిక మూలధన లాభాలు అంటారు. ఏడాది కన్నా ఎక్కువ వ్యవధిలో వాటిపై ఆర్జించే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలు అంటారు.
5. జీడీపీ- స్థూల దేశీయోత్పత్తి
ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం విలువను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంటారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిని పట్టి చూపే కీలకాంశాల్లో ఇది ఒకటి.
6. ద్రవ్య లోటు
ప్రభుత్వ మొత్తం వ్యయాలు, మొత్తం రాబడిని మించితే ఆ స్థితిని ద్రవ్య లోటు (ఫిస్కల్ డెఫిసిట్) అని వ్యవహరిస్తారు. ద్రవ్య లోటును లెక్కించేటప్పుడు రుణాలను పరిగణనలోకి తీసుకోరు.
7. కరెంటు ఖాతా లోటు
వస్తు, సేవల దిగుమతుల విలువ, ఎగుమతుల విలువ మధ్య వ్యత్యాసాన్ని కరెంటు ఖాతా లోటు అంటారు.
8. పెట్టుబడుల ఉపసంహరణ
ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన వాటాలను ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగా విక్రయించడాన్ని 'పెట్టబడుల ఉపసంహరణ' అంటారు.
9. ఆర్థిక బిల్లు
కొత్త పన్నులను, ఉన్న పన్ను విధానంలో మార్పులను ప్రభుత్వం ఆర్థిక బిల్లులో ప్రతిపాదిస్తుంది. బడ్జెట్ సమర్పించిన వెంటనే దీనిని ప్రవేశపెడతారు.
10. రెపో రేటు
ఆర్‌బీఐ తమకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు.
2025 బడ్జెట్ ప్రసంగం:
కేంద్రంలో ఎన్డీయే కూటమిలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పూర్తిస్థాయి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
కాగితం లేని బడ్జెట్ సమర్పించిన నిర్మలమ్మ
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది కూడా కాగితం వాడకుండా బడ్జెట్ సిద్ధం చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని నిక్షిప్తం చేసిన ట్యాబ్లెట్‌ను ఆమె ఎర్రటి సంచిలో మోసుకొచ్చారు. ట్యాబ్లెట్‌లోంచే బడ్జెట్ ప్రసంగాన్ని సభలో చదివి వినిపించారు.
1947లో తొలి ఆర్థికమంత్రి షణ్ముఖం చెట్టి ఒక తోలు సంచిలో బడ్జెట్ కాగితాలు సభకు తీసుకొచ్చారు. 1958-59లో ఆర్థిక శాఖను నిర్వహించిన జవహర్‌లాల్ నెహ్రూ నల్లటి బ్రీఫ్ కేసులో బడ్జెట్ కాగితాలను తెచ్చారు. మన్‌మోహన్‌సింగ్, ప్రణబ్ ముఖర్జీ సహా తదనంతర ఆర్థిక మంత్రులందరూ బ్రీఫ్‌కేసులనే వాడారు. లోక్‌సభలో సమర్పణకు పూర్వం ఆర్థిక మంత్రి తన బడ్జెట్ బ్రీఫ్‌కేసుతో మీడియా సమక్షంలో నిలబడటం ఆనవాయితీగా మారింది. 2019లో నిర్మలా సీతారామన్ ఈ సంప్రదాయాన్ని మార్చి బ్రీఫ్‌కేసుకు బదులు ఎర్రటి బహిఖాతా అనే సంచిలో బడ్జెట్ ప్రతిపాదనల్ని సభకు తీసుకు రావడం ప్రారంభించారు. ఈసారీ అదే ఆనవాయితీని కొనసాగించారు. 2021 నుంచి కాగితం ఉపయోగించని బడ్జెట్ సమర్పించడం ప్రారంభించారు.
క్యాబినెట్ ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన 2025-26 బడ్జెట్‌కు శనివారం ఆమోదం తెలిపింది. క్యాబినెట్ ఆమోదం అనంతరం ఆర్థిక మంత్రి లోక్‌సభలో బడ్జెట్ ప్రతిపాదనలు చదివారు. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మూడోసారి ఎన్నికల్లో గెలిచాక ప్రతిపాదించిన రెండో బడ్జెట్ ఇది.
గురజాడ వాక్యాలను ప్రస్తావించిన నిర్మలమ్మ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా తన ప్రసంగాన్ని గురజాడ సూక్తితో ప్రారంభించారు. 'దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్’ అంటూ తెలుగు కవి గురజాడ అప్పారావు సూక్తిని తన తొలి వాక్యాల్లో ప్రస్తావించారు.
‘పద్మశ్రీ’ గ్రహీత కానుకిచ్చిన చీరలో మెరిశారిలా
ఏటా బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపుల పైనే కాదు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరల పైనా అందరి దృష్టి ఉంటుంది. దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఆమె ఎంచుకునే చీరలు ఆసక్తిగా నిలుస్తాయి. చేనేత చీరలంటే మక్కువ చూపించే నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్ శారీనే ఎంచుకున్నారు. ఆమె బంగారు అంచుతో ఉన్న గోధుమవర్ణం చీర, ఎరుపు రంగు బ్లౌజ్, ఒక శాలువాతో కనిపించారు. దీనిపై ఉన్న చేపల ఆర్ట్ ఆకట్టుకుంది.
దీనిని పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి.. మంత్రికి కానుకగా ఇచ్చారు. సీతారామన్ ఓ కార్యక్రమం నిమిత్తం బిహార్‌లోని మధుబనికి వెళ్లినప్పుడు ఆమెను కలిసి ముచ్చటించారు. ఆ సమయంలో కళాకారిణి అయిన దులారీ తాను డిజైన్ చేసిన ఈ చేనేత చీరను ఆర్థికమంత్రికి బహూకరించారు.
మదుబని ఆర్ట్‌తో ఎన్నో పెయింటింగ్స్ వేసిన దులారీ దేవిని కేంద్రం 2021లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
నిర్మలమ్మ ‘బడ్జెట్’ శారీస్....
2019లో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు. ఆ సమయంలో బడ్జెట్ పత్రాలు తెచ్చే సూట్‌కేస్ స్థానంలో బహీ ఖాతాతో మీడియా ముందుకువచ్చారు.
2019లో తొలిసారి ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ.. అప్పటినుంచి ఏటా బడ్జెట్ రోజున తాను ధరించే చీరల విషయంలో ఏదోఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు.
2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ-బంగారు వర్ణంలో ఉన్న చీర కట్టులో మెరిశారు. ఈ రంగు శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తుంది. అలాగే ‘ఆస్పిరేషనల్ ఇండియా’ థీమ్‌కు అనుగుణంగా దీనిని ధరించారు.
2021లో ఎరుపు-గోధుమరంగు కలగలిసిన భూదాన్ పోచంపల్లి చీరలో కనిపించారు. తెలంగాణకు చెందిన ఈ పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.
2022లో మెరూన్ రంగు చీరను ధరించారు. ఇది కూడా ఒడిశాకు చెందిన చేనేత చీరే. ఆ రంగు దుస్తుల్లో ఆమె చాలా సాదాసీదాగా కనిపించారు. ఇది ఆమె నిరాడంబరతకు నిదర్శనమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
2023లో బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డర్‌లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరతో కనిపించారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ సమయంలో కాంతా చీరలో కళగా కన్పించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ప్రతీకగా ‘రామా బ్లూ’ రంగు చీర ధరించారు.
ఈ టస్సర్ పట్టు చేనేత చీరపై గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించే ఎంబ్రాయిడరీ ఉంది. గత ఏడాది ఎన్నికల అనంతరం జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమయంలో తెలుపు రంగు, బంగారు మోటిఫ్‌లతో ఉన్న మెజెంటా బోర్డర్ కలగలిపిన చీరలో ఆమె కన్పించారు.
బడ్జెట్‌లో పలు రంగాలకు కేటాయింపులు ఇలా..
బియ్యంపై కొత్త సుంకం:
మఖానా ఉత్పత్తులు, బియ్యంపై వాటి రకం, ప్రాసెసింగ్‌ల ప్రాతిపదికన కొత్త సుంకం విధించనున్నారు. కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ 1975 ప్రకారం సుంకంలో చేయనున్న ఈ మార్పు మే 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ సుంకం బియ్యంపై ఎలాంటి ప్రాసెసింగ్ (ఉప్పుడు బియ్యం వగైరా) జరిగింది, బియ్యం రకమేది (జీఐఎస్ గుర్తింపు పొందిన రకం, బాస్మతి రకం తదితర) అన్న ప్రాతిపదికన హెచ్‌ఎస్ కోడ్ 1006-30 అనే సబ్‌హెడ్ కింద విధిస్తారు. సాంకేతిక స్థాయి పురుగు మందులపై, అంతర్జాతీయ ఒప్పందాల కిందికి వచ్చే సరకులపై కొత్త టారిఫ్ విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
లోక్‌సభ ఎన్నికల ఖర్చులకు రూ.1,400 కోట్లు
గత ఏడాది లోక్‌సభ ఎన్నికలకు అయిన ఖర్చులకు సంబంధించి బడ్జెట్‌లో రూ.1,400 కోట్లను న్యాయ మంత్రిత్వశాఖకు కేటాయించారు. ఇందులో లోక్‌సభ ఎన్నికల వ్యయానికి రూ.500 కోట్లు, ఓటర్ల గుర్తింపు కార్డులకు రూ.300 కోట్లు, ఇతర ఖర్చులకు రూ.597.80 కోట్లను కేటాయించారు. కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొనుగోళ్లకు రూ.18.72 కోట్లను ఇచ్చారు.
సామాజిక న్యాయానికి ‘సాధికారత’
సామాజిక న్యాయం, సాధికారత శాఖకు బడ్జెట్లో కేటాయింపులు ఎకాయెకి 37.75 శాతం పెరిగాయి. ఈ శాఖకు రూ.13,611 కోట్లు కేటాయించారు. దీనిలో దివ్యాంగుల సంక్షేమానికి రూ.1,275 కోట్లు ఇచ్చారు. దళిత ‘యువ సాధకుల ఉన్నత విద్యకు ఉపకార వేతనాల’ (శ్రేయాస్) కింద రూ.472 కోట్లు కేటాయించారు. దీనిలో జాతీయస్థాయి/ విదేశీ విద్య ఉపకారవేతనాలతో పాటు ఉచిత శిక్షణకు నిధులూ ఉన్నాయి. ఓబీసీలు, ఈబీసీలకు శ్రేయాస్ కింద రూ.250 కోట్లు చూపించారు.
‘ఉజ్వల భారత్ కోసం ప్రధానమంత్రి యంగ్ అఛీవర్స్ ఉపకారవేతన అవార్డు’ (పీఎం యశస్వి)ల కోసం రూ.2,190 కోట్లు ప్రత్యేకించారు. ఓబీసీలు, ఈబీసీలు, అత్యంత దుర్బల గిరిజనులకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. దళిత విద్యార్థులకు పదోతరగతి తర్వాత విద్య కోసం ఉపకారవేతనాలు ఇవ్వడానికి రూ.6,360 కోట్లు లభించనున్నాయి. పీఎం అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన కింద దళితుల ఆధిక్య గ్రామాల్లో ఉపాధి కల్పనకు ఇచ్చిన నిధులు రూ.2,140 కోట్లు.
మూలధన వ్యయాలు రూ.11.21 లక్షల కోట్లు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయాలుగా రూ.11.21 లక్షల కోట్లను బడ్జెట్ ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.11.11 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని గత బడ్జెట్‌లో ప్రతిపాదించినా, తదుపరి రూ.10.18 లక్షల కోట్లకు ప్రభుత్వం సవరించింది. సవరించిన అంచనాల ప్రకారం ప్రభుత్వానికి రుణాలు మినహాయించి, ఆదాయం రూ.31.47 లక్షల కోట్లుగా ఉంది. నికర పన్ను వసూళ్లు రూ.25.57 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం వ్యయాలు రూ.47.16 లక్షల కోట్లుగా సవరించారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు రూ.3,487 కోట్లు
మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో వెచ్చించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులను ప్రతిపాదించింది. ఆయా రాష్ట్రాల్లో భద్రతా సంబంధ ఖర్చులకు, ప్రత్యేక మౌలిక సదుపాయాల సృష్టికి రూ.3,487.27 కోట్లు కేటాయించింది. ఈ పద్దు కింద నిరుడు రూ.2,463.62 కోట్లు ఇవ్వడం గమనార్హం. ఎన్‌డీయే ప్రభుత్వం 2026 మార్చికల్లా దేశం నుంచి మావోయిస్టుల ముప్పును నిర్మూలించాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించిన నేపథ్యంలో ఈ కేటాయింపు ప్రాధాన్యం సంతరించుకుంది.
హోంస్టేలకు ముద్రా రుణాలు
రాష్ట్రాల భాగస్వామ్యంతో 50 పర్యాటక కేంద్రాలను కేంద్రం అభివృద్ధి చేయనుంది. హోం స్టేలకు ముద్రా రుణాలు ఇవ్వనుంది. బుద్ధుడి జీవితానికి సంబంధించిన ప్రదేశాలపై ప్రత్యేకదృష్టి సారిస్తారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ఎంపికచేసిన విదేశీ పర్యాటక బృందాలకు ఈ-వీసా సదుపాయాలు, వీసా ఫీజు మినహాయింపు ఇస్తారు. పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు కీలక ప్రాంతాల్లో హోటళ్లకు మరింత మెరుగ్గా ఆర్థిక సాయం చేస్తారు. ఈ రంగానికి రూ.2,541.06 కోట్లు, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,900 కోట్లు కేటాయించారు.
లక్ష గృహాలకు రూ.15 వేల కోట్లు
‘స్వామిహ్-2’ నిధి కింద.. ఆగిపోయిన గృహనిర్మాణ ప్రాజెక్టుల్లో లక్ష ఇళ్లు పూర్తిచేసేందుకు రూ.15వేల కోట్లు కేటాయించారు. 2019 నవంబరులో కేంద్రం దేశవ్యాప్తంగా నిలిచిపోయిన గృహనిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ‘స్పెషల్ విండో ఫర్ ఎఫర్డబుల్ అండ్ మిడ్-ఇన్‌కమ్ హౌసింగ్’ (స్వామిహ్) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.
స్టేట్‌బ్యాంక్ గ్రూపునకు చెందిన ఎస్‌బీఐ క్యాప్ వెంచర్స్ ఈ నిధిని నిర్వహిస్తోంది. తొలివిడత విజయవంతం కావడంతో రెండో విడత నిధులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. స్వామిహ్-1 నిధి కింద 50 వేల ఇళ్లు పూర్తిచేశారు. తాజాగా కేటాయించిన రూ.15వేల కోట్లతో మరో లక్ష ఇళ్లు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
గిగ్ వర్కర్‌లకు గుర్తింపు కార్డులు
ఆర్థికరంగంలో నూతన ఒరవడులు సృష్టిస్తున్న గిగ్ వర్కర్‌లకు గుర్తింపు కార్డులను మంజూరు చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీరి పేర్లను ఈ శ్రమ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయించడంతో పాటు ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) కింద ఆరోగ్య సేవలు అందిస్తామన్నారు. ఈ విధానంలో సుమారు కోటి మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు
వీధి వ్యాపారుల కోసం ఉద్దేశించిన ‘పీఎం స్వానిధి’ పథకాన్ని ఉన్నతీకరిస్తున్నామని ఆర్థికమంత్రి తెలిపారు. ఇక నుంచి బ్యాంకుల నుంచి లోన్‌లతో పాటు రూ.30 వేల పరిమితితో యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులను పొందవచ్చని స్వానిధి పథకం ద్వారా ఇప్పటి వరకు 68 లక్షల మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు.
రాష్ట్రాలకు అందుబాటులో రూ.1.5 లక్షల కోట్ల నిధి
మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రాలకు 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు రూ.1.5 లక్షల కోట్ల నిధిని అందుబాటులోకి తీసుకువస్తున్నామని నిర్మల తెలిపారు. ఆస్తుల నగదీకరణ (ఎసెట్ మానిటైజేషన్) ద్వారా 2025-30 కాలంలో రూ.10 లక్షల కోట్లను సమీకరిస్తామని, ఇన్‌ఫ్రా రంగానికి సంబంధించిన ప్రతి మంత్రిత్వ శాఖ మూడేళ్ల కాలానికి పీపీపీ విధానంలో చేపట్టే ప్రాజెక్టులను ప్రతిపాదించాలని ఆదేశిస్తామని వివరించారు.
అతిపెద్ద లాజిస్టిక్ విభాగంగా పోస్టల్ శాఖ
1.5 లక్షల గ్రామీణ పోస్టాఫీసులతో పోస్టల్ శాఖను దేశంలోనే అతి పెద్ద లాజిస్టిక్ విభాగంగా తీర్చిదిద్దుతామని ఆర్థికమంత్రి ప్రకటించారు.
హైవేల అభివృద్ధికి రూ.2,87,333 కోట్లు
రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2.41 శాతం అధికంగా రూ.2,87,333.16 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు రూ.1,87,803 కోట్లు ఇవ్వనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు.
గిరిజనాభివృద్ధికి ఊతం
కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖకు కేటాయింపులు పెరిగాయి. గత ఏడాది కంటే 45 శాతం పెంపుతో 14,925.81 కోట్లను కేటాయించారు. ఏకలవ్య మోడల్ పాఠశాలలకు రూ.7,088.60 కోట్లు, ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ మిషన్‌కు రూ.380 కోట్లు, ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏఏజీవై)కు రూ.335.97 కోట్లు, ప్రధాన మంత్రి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్‌మన్)కు రూ.300 కోట్లు, ధార్తి ఆబా జన్‌జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డీఏజేజీయూఏ)కు రూ.2,000 కోట్లు ఇవ్వనున్నారు.
‘ట్రాక్ అండ్ ట్రేస్’తో పొగాకు పరిశ్రమకు మేలు
కేంద్ర బడ్జెట్‌లో కొన్ని వస్తువులపై ప్రకటించిన ‘ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజం’ వల్ల తమకు మేలు జరగనుందని పొగాకు పరిశ్రమ అభిప్రాయపడింది. హై రిస్క్ కమోడిటీల్లో పన్ను ఎగవేతను అరికట్టడం కోసం సీజీఎస్‌టీ యాక్ట్ 2017ను సవరించనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. ‘ఈ సవరణల వల్ల అమల్లోకి వచ్చే ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజం వల్ల దేశంలో చట్టవ్యతిరేక సిగరెట్ వాణిజ్యాన్ని నియంత్రించేందుకు వీలవుతుంద’ని టొబాకో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పేర్కొంది. దేశంలో అక్రమ సిగరెట్ల అమ్మకాల వల్ల ఏటా ప్రభుత్వానికి రూ.21,000 కోట్ల నష్టం వస్తోందని టీఐఐ తెలిపింది. ఇకపై పరిశీలన సులభం అయితే, చట్టబద్ధ వ్యాపారం పెరుగుతుందని వివరించింది.
మరింత స్నేహపూర్వకంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు
‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ స్ఫూర్తితో ప్రస్తుత ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాల (బీఐటీ) నమూనాను నవీకరించి, పెట్టుబడిదార్లకు మరింత స్నేహపూర్వంగా ఉండేలా తీర్చిదిద్దనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా విదేశీ పెట్టుబడిదార్లను ఆకర్షించాలన్నది లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుత బీఐటీ మోడల్‌ను కొన్ని దేశాలే అంగీకరిస్తున్న నేపథ్యంలో, తాజా ప్రకటన చోటు చేసుకోవడం విశేషం.
కొన్ని నిబంధనల విషయంలో ముఖ్యంగా వివాద పరిష్కార నియమావళిపై చాలా వరకు అభివృద్ధి చెందిన దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బ్రిటిన్ టెలికాం దిగ్గజం వొడాఫోన్, బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ పీఎల్‌సీలకు సంబంధించి రెట్రోస్పెక్టివ్ (పాత తేదీతో) పన్ను విధింపుల విషయంలో రెండు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేసులనూ మనదేశం ఓడిపోయిన నేపథ్యంలో.. ఈ ఒప్పందాల్లో మార్పులు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి.
గతేడాది ద్వైపాక్షిక ఒప్పందాలను యూఏఈ, ఉబ్జెకిస్థాన్‌లతో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం బ్రిటన్, సౌదీ అరేబియా, ఖతర్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతోనూ చర్చిస్తోంది. భారత్ తన 2015 నాటి నమూనాను మారుస్తున్నట్లు ప్రకటించడం, ఈ సమయంలో అత్యంత అవసరమైన చర్య అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్(జీటీఆర్‌ఐ) వ్యాఖ్యానించింది.
తోలు, పాదరక్షల రంగంలో 22 లక్షల ఉద్యోగాల సృష్టి
తోలు, పాదరక్షల రంగంలో ఉత్పాదకత, నాణ్యత, పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు ఓ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద డిజైన్ సామర్థ్యం, విడిభాగాల తయారీ, ఉత్పత్తికి అవసరమైన యంత్రాల విషయంలో సహకారం అందివ్వనునున్నారు. 22 లక్షల ఉద్యోగాలను, రూ.4 లక్షల కోట్ల టర్నోవరును ఇది సృష్టిస్తుందని అంచనా. రూ.1.1 లక్షల కోట్ల ఎగుమతులకూ ఈ పథకం వీలు కల్పించనుంది. కీలక అంతర్జాతీయ విపణుల్లో గిరాకీ సానుకూలతల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ తోలు, పాదరక్షల ఎగుమతులు 6 బిలియన్ డాలర్లను చేరే అవకాశం ఉంది. 2023-24లో వీటి ఎగుమతుల విలువ 4.69 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
విద్యుత్ పీఎస్‌యూల పెట్టుబడులు రూ.86,138 కోట్లు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9 ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల (పీఎస్‌యూ) మొత్తం పెట్టుబడులు 21% పెంచి 86,138.48 కోట్లు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 2024-25 బడ్జెట్‌లో రూ.67,286.01 కోట్ల పెట్టుబడులను అంచనా వేయగా, ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.71,278.33 కోట్లకు సవరించారు. 2025-26లో ఎన్‌టీపీసీ పెట్టుబడులు అత్యధికంగా రూ.26,000 కోట్లుగా ఉంటాయి. 2024-25లో ఇవి రూ.22,700 కోట్లే. పవర్‌గ్రిడ్ రూ.25,000 కోట్లు, ఎస్‌జేవీఎన్ రూ.12,000 కోట్లు, ఎన్‌హెచ్‌పీసీ రూ.13,000 కోట్లు, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ రూ.3,394.83 కోట్లు, నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ రూ.2,600 కోట్లు, తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూ.3,543.65 కోట్లు, చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ రూ.300 కోట్లు, పవర్‌సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. 2025-26లో విద్యుత్ శాఖ బడ్జెట్‌ను రూ.21,847 కోట్లకు పెంచారు.
కీలక టెక్నాలజీ ప్రాజెక్టులకు రూ.18,000 కోట్లు
కీలక టెక్నాలజీ ప్రాజెక్టులకు ప్రభుత్వం కేటాయింపులను పెంచింది. మొబైల్ ఫోన్లు, ఐటీ హార్డ్‌వేర్ పీఎల్‌ఐ పథకాలకు; సెమీకండక్టర్ పథకం, ఇండియా ఏఐ మిషన్ తదితరాలకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులను ప్రభుత్వం రూ.18,000 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రూ.9,766 కోట్లతో పోలిస్తే ఇవి 84% అధికం. దేనికి ఎంతంటే..
ఇండియాఏఐ మిషన్‌కు 11% అధికంగా రూ.2,000 కోట్లు కేటాయించారు. దేశంలో ఏఐ (కృత్రిమమేధ) వ్యవస్థ అభివృద్ధికి వీటిని ఉపయోగిస్తారు. ఇందులో భాగంగా కంప్యూటర్ వసతులకు ఆర్థిక మద్దతూ ఉంటుంది.
ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖకు కేటాయింపులు 48% ఎక్కువగా రూ.26,026.25 కోట్లకు చేర్చగా.. ఇందులో అధిక భాగం పీఎల్‌ఐ పథకానికి రూ.8,885 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందే కంపెనీల్లో ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, డిక్సన్ టెక్నాలజీస్, లావా ఇంటర్నేషనల్ తదితరాలున్నాయి.
సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కేటాయింపులు రెట్టింపై రూ.2499.96 కోట్లకు చేరాయి.
కాంపోజిట్ సెమీకండక్టర్లు, సెన్సార్లు, చిప్ అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ యూనిట్లకు కేటాయింపులు రూ.2,500 కోట్ల నుంచి రూ.3,900 కోట్లకు పెంచారు.
డిజైన్ అనుసంధానిత పథకానికి రూ.200 కోట్లు కేటాయించారు.
బడ్జెట్‌లో బిహార్‌పై వరాల జల్లు
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌పై కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వరాల వర్షం కురిపించింది. కేంద్ర బడ్జెట్‌లో బిహార్‌కు భారీగా కేటాయింపులు చేసింది. మఖానా బోర్డు ఏర్పాటు, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, మిథిలాంచల్ ప్రాంతంలోని వెస్ట్రన్ కోషి కెనాల్ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం సహా పలు వరాలను ఆ రాష్ట్రం దక్కించుకుంది. ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్ పార్టీ జేడీయూతో కలిసి రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉంది. కేంద్రంలోని ఎన్డీయేలో జేడీయూ కీలక భాగస్వామి. బిహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం.. ఎన్నికల ముందు ఇప్పుడు వరాల జల్లు కురిపించింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ రహదారుల అభివృద్ధి, గంగానదిపై రెండు లైన్ల వంతెన నిర్మాణం, విద్యుదుత్పత్తి కేంద్రం సహా రూ.60,000 కోట్ల విలువైన ఆర్థిక వరాలు ఇచ్చింది.
రైతుల శ్రేయస్సుకు..
రైతుల శ్రేయస్సు కోసం బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలాసీతారామన్ చెప్పారు. ‘మఖానా బోర్డు ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం. ఈ బోర్డు ద్వారా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడతాయి. రైతులకు శిక్షణ అందుతుంది. వారు అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలనూ పొందేలా బోర్డు చూస్తుంది’ అని మంత్రి వివరించారు. తూర్పు ప్రాంత రాష్ట్రాలైన బిహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ల సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన పూర్వోదయ పథకం అమలుకు కేంద్రం కట్టుబడి ఉందని నిర్మల చెప్పారు. అందులో భాగంగా బిహార్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్‌ను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. వసతిగృహ విస్తరణతో పాటు పలు మౌలిక సదుపాయాలను కల్పించి ఐఐటీ పట్నా సామర్థ్యాన్ని పెంచనున్నట్లు చెప్పారు. దీంతోపాటు పట్నా విమానాశ్రయ సామర్థ్యాన్ని పెంచి, బిహ్టా వద్ద బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు.
‘మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు పైగా భూమిని సాగుచేస్తున్న రైతులకు ప్రయోజనం చేకూర్చే వెస్ట్రన్ కోసీ కెనాల్ ప్రాజెక్టుకు ఆర్థికసాయం అందిస్తాం’ అని నిర్మల వివరించారు. పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశగా బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇది ప్రగతిశీల బడ్జెట్ అని, బిహార్ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేటాయింపులు తోడ్పడతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్ అన్నారు. కాగా గతంలో బిహార్‌కు ప్రకటించిన పథకాలను గుదిగుచ్చి కొత్త పొట్లంలో కట్టి ఇచ్చారని, కేంద్ర బడ్జెట్ అంతా నిర్మలాసీతారామన్ వాక్చాతుర్యంతో నిండిందని ఆర్జేడీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ విమర్శించారు. ‘మీకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నయం. తన రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల మేర లబ్ధి చేకూర్చుకున్నారు. ఈ బడ్జెట్.. బిహార్‌కు ఎలాంటి ప్రయోజనాన్నీ కలిగించలేదు’ అని ఆయన అన్నారు.
పట్టణాల్లో వసతుల కల్పనకు ఊపు
కేంద్ర బడ్జెట్‌లో కొత్తగా తీసుకొచ్చిన ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ నిధుల కోసం గట్టిగా ప్రయత్నించి సాధిస్తే రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచవచ్చు. రూ.లక్ష కోట్లతో పథకాన్ని కేంద్రం ప్రారంభించి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించింది. పట్టణాల్లో తాగునీటి సరఫరా, ప్రజారోగ్యం తదితర మౌలిక సదుపాయాల కల్పన పనులకు ప్రాజెక్టు అంచనా విలువలో 25% నిధులను కేంద్రం ఇవ్వనుంది.
123 పుర, నగరపాలక సంస్థల్లో రోజూ 1,923 మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తోంది. ఇందులో 545 మిలియన్ లీటర్ల నీటినే శుద్ధి చేస్తున్నారు. కొత్తగా మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటుచేసి సమస్యకు పరిష్కారాన్ని చూపొచ్చు.
మైనారిటీల అభివృద్ధికి ఊతం
ప్రధానమంత్రి జన్‌వికాస్ కార్యక్రమానికి(పీఎంజేవీకే) బడ్జెట్‌లో కేంద్రం నిధుల కేటాయింపు భారీగా పెంచిన నేపథ్యంలో.. వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఈ పథకాన్ని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తిరిగి గాడినపెట్టే అవకాశమొచ్చింది. పీఎంజేవీకే కింద రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పార్కులు, స్పోర్ట్స్ సెంటర్లు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకుగాను రూ.250 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. కానీ మైనారిటీల జనాభా దామాషా ప్రకారం రాష్ట్రానికి రూ.95 కోట్ల వరకు మంజూరయ్యే అవకాశముంది. అయితే కనీసం 25 శాతానికిపైగా మైనారిటీలున్న ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి జన్‌వికాస్ కార్యక్రమానికి(పీఎంజేవీకే) కేంద్రం 110 శాతం నిధుల కేటాయింపును పెంచింది. 2024-25లో రూ.911 కోట్లు కేటాయించగా... 2025-26 బడ్జెట్‌లో దానికి మరో రూ.1,003 కోట్లు పెంచి రూ.1,914 కోట్లు కేటాయించింది. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయగా వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
కిసాన్ క్రెడిట్ కార్డులపై.. 4% వడ్డీకే రూ.5 లక్షల వరకు పంటరుణం
కిసాన్ క్రెడిట్ కార్డులపై (కేసీసీ) బ్యాంకుల్లో రైతులు తీసుకునే పంటరుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో రాష్ట్రంలో సుమారు 25 లక్షల మందికి పైగా అన్నదాతలకు ప్రయోజనం కలగనుంది. తక్కువ వడ్డీకే అధిక రుణం అందుకోనున్నారు. ప్రస్తుతం కేసీసీపై బ్యాంకులు ఏడాదికి 7% వడ్డీ చొప్పున గరిష్ఠంగా రూ.3 లక్షల రుణం ఇస్తున్నాయి. ఈ అప్పు ఏడాదిలోగా చెల్లిస్తే 3% తగ్గించి, 4% మాత్రమే వసూలు చేస్తున్నాయి. తాజా ప్రకటనతో పంటరుణ పరిమితి ఆధారంగా రూ.5 లక్షల అప్పు వరకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది.
రాష్ట్రంలో ఏటా ఖరీఫ్, రబీలో కలిపి వ్యవసాయ రంగానికి రూ.3.28 లక్షల కోట్ల రుణాలిస్తున్నారు. వీటిలో పంటరుణాలు రూ.1.93 లక్షల కోట్లు. కేసీసీపై రుణపరిమితి పెంచడం ద్వారా రైతులకు అధిక మొత్తంలో అందనుంది. ఉదాహరణకు 4 ఎకరాల మిరప సాగు చేసే రైతుకు ప్రస్తుత పరిమితి మేరకు గరిష్ఠంగా రూ.3 లక్షల రుణానికే వడ్డీ రాయితీ వర్తిస్తోంది. ఇకపై ఆ రైతుకు రూ.5 లక్షల వరకు పంట రుణమిస్తారు. అంటే మరో రూ.2 లక్షల అప్పు తక్కువ వడ్డీకే అందుతుంది.
తిరుపతి ఐఐటీ సామర్థ్యం రెట్టింపు
దేశంలో ఐఐటీల సామర్థ్యాన్ని విస్తరించేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చింది. 2014 తర్వాత ఏర్పాటు చేసిన 5 ఐఐటీల్లో మరో 6,500 మంది విద్యార్థులకు వసతులు కల్పించనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా తిరుపతి ఐఐటీకి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఐఐటీలో 240 సీట్లు ఉండగా.. సదుపాయాలు కల్పిస్తే వీటి సంఖ్య పెరగనుంది.
ఈసారి విద్యలో రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న తరుణంలో ఈ కేటాయింపులు ఉపయోగపడనున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వచ్చే ఐదేళ్లల్లో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఎక్కువ శాతం ఏపీకి తెచ్చుకునే అవకాశం ఉంది.
విశాఖ పోర్ట్ ట్రస్టుకు రూ.730 కోట్లు
విశాఖపట్నం పోర్ట్ ట్రస్టుకు కేంద్రం కేటాయింపులు భారీగా పెంచింది. 2024-25లో రూ.150 కోట్లు కేటాయించి అంచనాల సవరణనాటికి దాన్ని రూ.285 కోట్లకు పెంచిన కేంద్ర నౌకాయానశాఖ 2025-26లో రూ.730 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్‌కంటే 386%, సవరించిన అంచనాలకంటే 156% ఎక్కువ.
మెట్రో ప్రాజెక్టులకు భారీ ఇం‘ధనం’
కేంద్ర బడ్జెట్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టులకు నిధులు భారీగా కేటాయించడంతో విజయవాడ, విశాఖలో ప్రతిపాదిత ప్రాజెక్టులపై ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు నగరాల్లోనూ మొదటి దశ పనులకు రూ.11 వేల కోట్ల చొప్పున రూ.22 వేల కోట్ల అంచనాలతో కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు పంపింది. గట్టిగా ప్రయత్నిస్తే రాష్ట్రానికి నిధులొచ్చి కొత్త ఆర్థిక సంవత్సరంలోనే మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు ప్రారంభం కావొచ్చు. మెట్రో, మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఎంఆర్‌టీఎస్) ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో రూ.31,106 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే ఇది రూ.6,505 కోట్లు అదనం. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు 100% నిధులివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు.
డ్వాక్రా మహిళల స్వయం ఉపాధికి బాసట
జాతీయ జీవనోపాధుల కల్పన కార్యక్రమానికి కేంద్రం బడ్జెట్‌లో 20 శాతం మేర కేటాయింపులు పెంచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తే డ్వాక్రా మహిళల స్వయం ఉపాధికి మరింత ఊతం లభించనుంది. ఇప్పటికే డ్వాక్రా మహిళల ఉపాధి కల్పన కింద సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. రైతు ఉత్పాదక సంస్థ(ఎఫ్‌పీవో)లను ఏర్పాటు చేసి వ్యవసాయానికి చేయూతగా నిలుస్తోంది. జాతీయ జీవనోపాధుల కల్పనకు గతేడాది కేంద్రం రూ.15,047 కోట్లు ఇస్తే....దానికి తాజాగా రూ.3,958 కోట్లు పెంచి రూ.19,005 కోట్లు కేటాయించింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద రూ.600 కోట్ల వరకు వినియోగించుకుంది. దాదాపుగా 89 లక్షల మంది డ్వాక్రా మహిళలున్న నేపథ్యంలో ఈ పథకాన్ని విస్తరిస్తే రూ.800 కోట్ల వరకు కేంద్రం నుంచి పొందవచ్చు.
మనమూ ‘ఉడాన్’లో విహరించొచ్చు
రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అనుసంధానించేందుకు కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉంది. ఉడాన్ పథకం కింద అదనంగా 120 మార్గాల్లో విమాన సేవలు అందుబాటులోకి తేవాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్న విమానాశ్రయాల నుంచి వాణిజ్య కార్యకలాపాలను పెంచేందుకు ‘ఉడాన్’ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఆయా విమానాశ్రయాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అక్కడి నుంచి సర్వీసులు పెంచేలా కేంద్రం వీజీఎఫ్(వయబిలిటీ గ్యాప్ ఫండింగ్)ను అందిస్తుంది. నిబంధనల మేరకు.. కడప, కర్నూలు విమానాశ్రయాల నుంచి మాత్రమే ఉడాన్ సర్వీసులు నడిపే అవకాశం ఉంది. అదనపు సర్వీసుల కోసం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) పౌర విమానయాన సంస్థకు ప్రతిపాదనలను పంపింది. వాటిలో కర్నూలు-విశాఖపట్నం, బెంగళూరు, చెన్నైకి, కడప- విజయవాడ, హైదరాబాద్, చెన్నై సర్వీసుల ప్రతిపాదనలున్నాయి.
దృష్టిపెడితే ఇవీ పూర్తి..
ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు కుప్పం, దగదర్తి, ఒంగోలు, తాడేపల్లిగూడెం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని-అన్నవరంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్‌నాయుడు దృష్టిపెడితే ఉడాన్ పథకం కింద కొత్త సర్వీసులు, విమానాశ్రయాల నిర్మాణ పనులు పూర్తి చేసే అవకాశం ఉంది.
గ్రామీణాభివృద్ధికి రూ 1.81 లక్షల కోట్లు
బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు 1.81 లక్షల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం కన్నా ఇది 5.75 శాతం అధికం. రాష్ట్రాల భాగస్వామ్యంతో గ్రామీణ సమృద్ధి, పురోగమన కార్యక్రమం చేపట్టనున్నట్టు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు భాగస్వామ్యం కల్పిస్తారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు పెంపొందించాలన్నదే మా లక్ష్యం. తద్వారా వలస వెళ్లడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి గ్రామీణులకు కలగకుండా చూస్తాం. ఈ కార్యక్రమం గ్రామీణ మహిళలకు, యువ రైతులకు, గ్రామీణ యువతకు, చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగిస్తుంది’’ అని నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘ఈ బడ్జెట్ ఆత్మనిర్భర్ భారత్‌ను సాకారం చేస్తుంది,’’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ‘‘దారిద్య్ర రహిత భారతాన్ని సృష్టించడానికి గ్రామాల నుంచి దారిద్య్రాన్ని నిర్మూలించాలి. ఆర్థిక మంత్రి ప్రకటించిన గ్రామీణాభివృద్ధి పథకం ఆ లక్ష్యాన్ని సాధిస్తుంది,’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధానమంత్రి గ్రామ సడక్‌యోజన పథకానికి ఈసారి రూ.19 వేల కోట్లు కేటాయించారు. ఇది క్రితం సారి జరిపిన సవరించిన కేటాయింపుల కన్నా 31 శాతం అధికం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ పథకానికి రూ 54,832 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్‌లో కేటాయించిన మొత్తానికి దాదాపు సమానం. అయితే సవరించిన అంచనాల ప్రకారం ఈ రంగానికి గత సంవత్సరం వాస్తవంగా వ్యయం చేసింది రూ 32,426.33 కోట్లు.
యుద్ధ విమానాలు, ఏరో ఇంజిన్ల కొనుగోలుకు రూ. 48,614 కోట్లు
చైనా, పాకిస్థాన్ నుంచి భద్రతా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తాజా బడ్జెట్‌లో కేటాయింపులను ప్రభుత్వం పెంచింది. ఈ పద్దు కింద రూ.6,81,210 కోట్లను ప్రతిపాదించింది. 2024-25 బడ్జెట్ కేటాయింపుల (రూ.6.22 లక్షల కోట్లు)తో పోలిస్తే ఇది 9.53 శాతం అధికం. సవరించిన అంచనాల (రూ.6.41 లక్షల కోట్ల)తో పోలిస్తే 6.2 శాతం ఎక్కువ. తాజా కేటాయింపుల్లో కొత్త ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు పెద్దపీట వేశారు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రక్షణ కేటాయింపులు 1.91 శాతంగా ఉన్నాయి.
తాజా బడ్జెట్‌లో మూలధన వ్యయం కింద రూ.1.8లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది. కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకలు, ఇతర సైనిక హార్డ్‌వేర్ కొనుగోలుకు ఈ సొమ్మును వెచ్చిస్తారు. 2024-25 బడ్జెట్‌లో రూ.1.72 లక్షల కోట్లను మూలధన వ్యయం కింద ప్రతిపాదించారు. సవరించిన అంచనాల్లో అది రూ.1,59,500 కోట్లకు తగ్గిపోయింది.
తాజాగా కేటాయించిన మూలధన వ్యయంలో రూ.1,48,722.80 కోట్లను ఆధునికీకరణకు వెచ్చిస్తారు. రూ.31,277 కోట్లను పరిశోధన, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తారు. ఆధునికీకరణకు ప్రత్యేకించిన సొమ్ములో 75 శాతాన్ని స్వదేశీ ఆయుధాల కొనుగోలుకు ఖర్చుపెడతారు. ‘దేశీయ’ వాటాకు ప్రత్యేకించిన నిధుల్లో 25 శాతాన్ని ప్రైవేటు పరిశ్రమల నుంచి రక్షణ సాధన సంపత్తి సమీకరణకు వెచ్చిస్తారు.
యుద్ధనౌకల కోసం రూ.24,390 కోట్లను ప్రత్యేకించారు.
రక్షణ కేటాయింపుల్లో రెవెన్యూ వ్యయం కింద రూ.4,88,822 కోట్లను కేటాయించారు. దీన్ని నిర్వహణ ఖర్చులు, వేతనాలు, పింఛన్లకు వెచ్చిస్తారు. ఇందులో సైనికదళాల వేతనాలకు రూ.1,97,317 కోట్లు, పింఛన్లకు రూ.1,60,795 కోట్లను కేటాయించారు. పోరాట సన్నద్ధతను మెరుగుపరచుకునేందుకు నిధులను పెంచారు.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు రూ.26,816 కోట్లను ప్రతిపాదించారు. గత ఏడాది ఈ పద్దు కింద రూ.23,855 కోట్లను వెచ్చించారు.
రైల్వేలకు రూ.2.65 లక్షల కోట్లు
రైల్వేలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈసారి బడ్జెట్‌లో రూ.2.65 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో రూ.2.52 లక్షల కోట్ల సాధారణ ఆదాయాలు, రూ.200 కోట్ల నిర్భయ ఫండ్, అంతర్గత వనరుల నుంచి రూ.3వేల కోట్లు, బడ్జెటేతర వనరుల నుంచి రూ.10వేల కోట్లు ఉంటాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికులు, సరకు రవాణా తదితర మార్గాల్లో రూ.3.02 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈసారి ప్రధానంగా 17,500 జనరల్ బోగీలు, 200 వందేభారత్ రైళ్లు, 100 అమృత్‌భారత్ రైళ్లు, 50 నమోభారత్ రైళ్ల ఉత్పత్తికి పచ్చజెండా ఊపారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాబోయే నాలుగైదేళ్లలో రూ.4.6 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులు అమలుచేస్తామని తెలిపారు. వీటిలో కొత్త లైన్లు వేయడం, డబ్లింగ్, నాలుగు లైన్లు చేయడం, కొత్త నిర్మాణాలు, స్టేషన్ల అభివృద్ధి, పైవంతెనలు, అండర్‌పాస్‌లు.. ఇలా చాలా ఉన్నాయని రైల్‌భవన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
‘‘మార్చి నెలాఖరులోపు 1,400 జనరల్ బోగీలు తయారవుతాయి. వెయ్యి పైవంతెనల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. సరకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరిగింది మార్చి 31 నాటికి 1600 కోట్ల టన్నుల సామర్థ్యాన్ని చేరుకుని, ప్రపంచంలో చైనా తర్వాత రెండోస్థానంలో ఉంటాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికల్లా నూరుశాతం విద్యుదీకరణ సాధిస్తాం. రైల్వేల భద్రతకు వెచ్చించే మొత్తాన్ని రూ.1.08 లక్షల కోట్ల నుంచి రూ. 1.16 లక్షల కోట్లకు పెంచాం. పీపీపీ పెట్టుబడులను కూడా కలిపితే రైల్వేలకు మొత్తం కేటాయింపు రూ.2.64 లక్షల కోట్లు అవుతుంది’’ అని వివరించారు.
2024-25 సవరించిన అంచనాల్లో రైల్వే భద్రతకు రూ.1,14,062 కోట్లు కేటాయించగా, 2025-26 బడ్జెట్ అంచనాల్లో రూ.1,16,514 కోట్లు ఇచ్చారు. ఏడాదికి 4వేల కిలోమీటర్ల కొత్త లైన్లు వేస్తున్నారు. గడిచిన పదేళ్లలో 31,180 కి.మీ. కొత్త ట్రాక్‌లు వేశారు. అయితే.. సిగ్నలింగ్, టెలికంకు ఇచ్చిన కేటాయింపు రూ.6,800 కోట్లేనని, కానీ వచ్చే ఐదేళ్లలో 44వేల రూట్ కిలోమీటర్లకు ‘కవచ్’ వ్యవస్థ ఏర్పాటు చేయాలనుకుంటున్నందున ఈ మొత్తం సరిపోదని ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ మాజీ డీజీ శైలేంద్రకుమార్ గోయల్ వ్యాఖ్యానించారు.
ఏం పెరుగుతాయ్?.. ఏం తగ్గుతాయ్?
ధరలు పెరిగేవి
► దిగుమతి చేసుకున్న ఇంటెరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ డిస్‌ప్లేలు
► దిగుమతి చేసుకున్న కొన్నిరకాల అల్లిక వస్త్రాలు
ధరలు తగ్గేవి
► దిగుమతి చేసుకున్న మోటారు సైకిళ్లు
►10 మంది లేదా అంతకంటే ఎక్కువ మందిని రవాణా చేసే సామర్థ్యమున్న దిగుమతి చేసుకున్న వాహనాలు
► దిగుమతి చేసుకున్న ప్రాణాధార ఔషధాలు, క్యాన్సర్ ఔషధాలు
► ఆహారం, శీతల పానీయాల పరిశ్రమల్లో వినియోగించే సింథటిక్ ఫ్లేవరింగ్ ఎసెన్స్‌లు, మిశ్రమాలు
► క్యారియర్ గ్రేడ్ ఈథర్‌నెట్ స్విచ్‌లు
ఎన్‌పీఎస్ వాత్సల్య మరింత ఆకర్షణీయం
గత ఏడాది (2024) సెప్టెంబరు 18న ప్రారంభించిన ఎన్‌పీఎస్-వాత్సల్య పథకం ద్వారా పన్ను మినహాయింపు పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా కల్పించింది. ఈ పథకాన్ని మైనర్లు అయిన పిల్లల పేరుతో ప్రారంభించే తల్లిదండ్రులు/సంరక్షకులు ఏడాదికి చెల్లించే విరాళంపై (రూ.50 వేల వరకు) పన్ను మినహాయింపు ప్రయోజనానికి అర్హులవుతారు. వారికి వర్తించే పన్ను శ్లాబ్ ప్రకారం లబ్ధి కలుగుతుంది. 2025-26 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రతిపాదించారు. ఈ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే పాత ఆదాయపు పన్ను విధానాన్నే ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఎన్‌పీఎస్-వాత్సల్య పథకాన్ని 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ పథకం ప్రకారం మైనర్లు అయిన పిల్లల పేరుతో ఖాతాలను ఆల్‌లైన్ లేదా బ్యాంకు/పోస్టాఫీసు ద్వారా తల్లిదండ్రులు/సంరక్షకులు ఖాతాలను ప్రారంభించి ఏడాదికి కనీసం రూ.1000 చొప్పున పొదుపు చేయాల్సి ఉంటుంది. ఆ పిల్లలు మేజర్లు (18 ఏళ్ల వయసు) అయిన తర్వాత ఆ ఖాతా రెగ్యులర్ ఎన్‌పీఎస్‌గా మారిపోతుంది. ఇప్పటి వరకు ఎన్‌పీఎస్-వాత్సల్య పథకం ఖాతాలను 89,475 మంది ప్రారంభించారు. దీనికి పన్ను ప్రయోజనాలను కూడా అదనంగా కల్పించడంతో ఈ పథకంలో మరింత మంది చేరే అవకాశం ఉంది.
2025-26కుగాను రూ.10 వేల కోట్ల కేటాయింపు
పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై కేంద్రం మరింతగా దృష్టిపెట్టనుంది. ఇందుకోసం రూ.లక్ష కోట్లతో ‘పట్టణ సవాలు నిధి (యూసీఎఫ్)’ని ఏర్పాటు చేయనుంది. నగరాలను అభివృద్ధి హబ్‌లుగా తీర్చిదిద్దడం, వాటిని సృజనాత్మక రీతిలో తిరిగి అభివృద్ధి చేయడం, నీరు-పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడం కోసం వచ్చే ప్రతిపాదనల అమలుకు యూసీఎఫ్‌ను ఉపయోగిస్తారు. రుణాలు తీసుకునేందుకు అర్హమైన ప్రాజెక్టులకు.. వాటి వ్యయంలో 25% సొమ్ము వరకు దీనికింద పొందవచ్చు. అయితే అందుకోసం- ప్రాజెక్టు వ్యయంలో కనీసం 50 శాతానికి బాండ్లు, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాల (పీపీపీ) రూపంలో సమకూర్చుకోవడం తప్పనిసరి. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను యూసీఎఫ్ కోసం రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకంలో సూరత్, విశాఖపట్నం, వారణాసి నగరాలు పరిశీలనలో ఉండగా తెలంగాణ నుంచి పలు నగరాలకు చోటు దక్కే అవకాశముంది.
చిన్న పారిశ్రామికవేత్తలకు ఆర్థిక మద్దతు
బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ (సీజీటీఎంఎస్‌ఈ) కింద కొత్తగా ఏర్పాటు చేసే చిన్న పరిశ్రమలకు రెట్టింపు ఆర్థిక మద్దతు లభించనుంది. ఈ పథకం కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు హామీ లేకుండా ప్రస్తుతం ఇచ్చే రుణాన్ని రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు కేంద్రం పెంచింది. హామీలు ఇచ్చే పరిస్థితి లేక పెట్టుబడుల కోసం ప్రైవేటు సంస్థల నుంచి అధిక వడ్డీ రేటుకు రుణాలు తెచ్చుకొనే వారికి ఇక మీదట ఆ బాధలు తప్పనున్నాయి.
ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా ఆ రంగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఐదేళ్లలో తయారీ రంగంలో సుమారు 2 లక్షల కొత్త ఎంఎస్‌ఎంఈలను తీసుకురావాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ ట్రస్ట్ నిధి కింద వాటికి సులువుగా రుణాలు లభిస్తాయి. అలాగే అంకుర సంస్థలకు రుణ పరిమితి రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెరగనుంది. ఎంఎస్‌ఎంఈల వర్గీకరణలో చేసిన మార్పులతో ఎక్కువ మందికి హామీ లేని రుణాన్ని పొందే వెసులుబాటు లభించనుంది.
సూక్ష్మ పరిశ్రమలు: వార్షిక టర్నోవర్ పరిమితి రూ.కోటి నుంచి రూ.2.5 కోట్లకు పెంచారు
చిన్న పరిశ్రమలు: రూ.10 కోట్ల నుంచి రూ.25 కోట్లకు పెంపుదల
మధ్యతరహా పరిశ్రమలు: రూ.50 కోట్ల నుంచి రూ.125 కోట్లకు పెంపు
తాత్కాలిక అవసరాలకు క్రెడిట్ కార్డులు
కేంద్రం ఉధమ్ పోర్టల్ ప్రకారం రాష్ట్రం నుంచి 12 లక్షల ఎంఎస్‌ఎంఈలు రిజిస్టర్ అయ్యాయి. వాటన్నింటికీ కేంద్రం రూ.5 లక్షల పరిమితితో ప్రకటించిన క్రెడిట్ కార్డులు పొందేందుకు అర్హత ఉంది. విద్యుత్ బిల్లులు, పన్నులు చెల్లించేందుకు నిధులు సర్దుబాటు కాని సమయంలో క్రెడిట్ కార్డును వినియోగించుకునే వెసులుబాటు వారికి లభిస్తుంది. రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపుతో మెజారిటీ సూక్ష్మ పరిశ్రమల నిర్వాహకులకు పన్ను భారం నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
యువత.. అన్నదాత.. మహిళల పురోగతే లక్ష్యం
ఈ బడ్జెట్ ప్రధానంగా యువత, అన్నదాతలు, మహిళల అభివృద్ధే లక్ష్యంగా సాగుతోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. ఆదాయపన్ను శ్లాబులను సవరించడం, రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారికి రిబేటు ఇవ్వడం ద్వారా కోటి మందికి పైగా ప్రజలు పన్ను కట్టాల్సిన అవసరం లేదని.. దానివల్ల ప్రజల చేతుల్లో తగినంత ధనం పెట్టినట్లయిందని చెప్పారు.
‘‘ఆరు రంగాల్లో గణనీయమైన మార్పులు తెచ్చాం. వాటిలో పన్నులు, విద్యుత్ రంగం, పట్టణాభివృద్ధి, గనులు, ఆర్థికరంగం, నియంత్రణ సంస్కరణలు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి అండగా ఉంటున్నాం. విత్తనం నుంచి మార్కెట్ వరకు అన్నిరకాల మార్పులకు శ్రీకారం చుట్టాం. పెట్టుబడి సాయం, రుణాలు, కొత్త వంగడాల సృష్టి.. ఇలా అనేక రకాలుగా రైతులకు మద్దతు ఇస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని మరింత మెరుగుపరిచాం. ఈ బడ్జెట్‌లో విద్యుత్ తయారీ, పంపిణీలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. అవసరమైన మూలధన వ్యయం కల్పించాం’’ అని ఆర్థిక మంత్రి వివరించారు.
తల్లీపిల్లలు భద్రం
మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో కేటాయింపు పెంచారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం రూ.23,182.98 కోట్లను వీరికి ఇవ్వగా, 2025-26 సంవత్సరానికి రూ.26,889.69 కోట్లు చూపించారు. వీటిలో సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0 కింద అత్యధికంగా రూ.21,960 కోట్లు ఖర్చు చేయనున్నారు. పౌష్టికాహార లోపాన్ని అధిగమించి, చిన్నారుల సంరక్షణను బలోపేతం చేసేందుకు ఈ నిధుల్ని వినియోగిస్తారు. ఎనిమిది కోట్ల మంది పిల్లలకు పౌష్టికాహారం అందడానికి, కోటిమంది గర్భిణులు/ బాలింతలకు, 20 లక్షల మంది కిశోరప్రాయ బాలికలకు (ఆకాంక్షిత జిల్లాలు, ఈశాన్య రాష్ట్రాల్లో) ఈ పథకం కింద ప్రయోజనం లభించనుంది. వెనకబడిన ప్రాంతాల్లో పోషకాహారపరంగా మద్దతు ఇచ్చేందుకు కేటాయింపులు దోహదపడనున్నాయి. ప్రధానమంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద రూ.120 కోట్లు కార్పస్‌గా కేటాయించారు. మిషన్ వాత్సల్యకు గత బడ్జెట్లో రూ.1,391 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.1,500 కోట్లు కేటాయించారు. దుర్బల పిల్లలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించడం దీని ఉద్దేశం. సంస్థాగత, కుటుంబ ఆధారిత రక్షణ కల్పించడం, దత్తతను ప్రోత్సహించడం, అత్యవసర సందర్భాల్లో చిన్నారుల ఆచూకీని కనిపెట్టడం వంటివాటికి ఈ పథకంలో చోటుంటుంది.
మహిళా సాధికారత, మిషన్ శక్తి
మహిళా సాధికారత కోసం మిషన్ శక్తి కింద కేటాయింపుల్ని రూ.3,150 కోట్లకు పెంచారు. బేటీ బచావో- బేటీ పఢావో, వన్‌స్టాప్ కేంద్రాలు, నారీ అదాలత్‌లు, మహిళా సహాయవాణులు, మహిళా పోలీసు వాలంటీర్లకు రూ.628 కోట్లు కేటాయించారు. నిర్భయ నిధికి రూ.30 కోట్లు ఇచ్చారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి తొలిసారి వ్యాపారవేత్తలుగా మారిన మహిళలకు రుణ పథకాన్ని ఈసారి బడ్జెట్లో ప్రకటించారు. దీనిద్వారా దేశంలోని 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు రూ.2 కోట్ల చొప్పున రుణాలను మంజూరు చేయనున్నారు. వారి వ్యాపారాలకు కేంద్ర సర్కారు ఆర్థికంగా దన్నుగా నిలవనుంది.
ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా త్యాగం చేసి ప్రజల మీద పన్నుభారాన్ని తగ్గించామని ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే చెప్పారు. ఇప్పటికే మొత్తం ఆదాయపన్ను చెల్లింపుదారుల్లో 75% మంది కొత్త విధానానికి మారారని, క్రమంగా అందరూ అందులోకి మారుతారని ఆశిస్తున్నామని తెలిపారు.
2047 నాటికి వంద గిగావాట్ల విద్యుత్ సామర్థ్యమే లక్ష్యం
అణు విద్యుత్ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ రంగంలోకి ప్రైవేటు సంస్థలను ఆహ్వానించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అణు పరిశోధనల కోసం రూ.20వేల కోట్లతో ‘న్యూక్లియర్ ఎనర్జీ మిషన్’ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2033 నాటికి కనీసం ఐదు చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్‌ఎంఆర్)ను ఏర్పాటు చేయడమే దీని లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. భారత ఇంధన పరివర్తన కసరత్తులో భాగంగా 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తిని సాధించాల్సి ఉందన్నారు. ఈ లక్ష్య సాధన కోసం ప్రైవేటు రంగంతో క్రియాశీల భాగస్వామ్యాన్ని సాకారం చేసేందుకు అణు విద్యుత్ చట్టం, పౌర అణు విపత్తు జవాబుదారీ చట్టానికి సవరణలు చేయనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో 24 అణు కర్మాగారాల ద్వారా 8.1 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతోంది. 2032 నాటికి దాన్ని 20 గిగావాట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది. దేశంలోని అణువిద్యుత్ కర్మాగారాలన్నింటినీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని అణు విద్యుత్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐఎల్) నిర్వహిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ఆస్కారం లేదు. ఈ నేపథ్యంలో సంస్కరణలు, చట్టసవరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఏమిటీ ఎస్‌ఎంఆర్‌లు?
స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు (ఎస్‌ఎంఆర్) అనేవి కొత్తతరం అణు విచ్ఛిత్తి రియాక్టర్లు. గరిష్ఠంగా 300 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిని ప్రత్యేక కర్మాగారాల్లో నిర్మించి, నిర్దేశిత ప్రదేశానికి తరలించి అక్కడ పూర్తిస్థాయి అసెంబ్లింగ్ చేపడతారు. ఉక్కు, అల్యూమినియం, రాగి, సిమెంటు కర్మాగారాలు సొంత అవసరాల కోసం ఏర్పాటు చేసుకునే బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల స్థానంలో వీటిని నెలకొల్పుకోవచ్చు. 220 మెగావాట్ల ‘భారత్ స్మాల్ రియాక్టర్ల’ స్థాపన కోసం ఎన్‌పీసీఐఎల్.. గత ఏడాది ప్రతిపాదనలు ఆహ్వానించింది.
192% పెరిగిన అప్పు.. పదేళ్లలో రూ.62 లక్షల కోట్ల నుంచి రూ.181 లక్షల కోట్లకు..
దేశంపై అప్పుల భారం 2026 మార్చి 31 నాటికి రూ.196,78,772.62 కోట్లకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనావేసింది. ఇందులో రూ.190,14,852 కోట్లు దేశీయ, రూ.6,63,920 కోట్లు విదేశీ రుణం. 2025 మార్చి 31 నాటికి ఇది రూ.181,74,284.36 కోట్లు కానుంది. 2015 మార్చి 31 నాటికి దేశ రుణం రూ.62,22,357.55 కోట్లమేర ఉంది. పదేళ్లలో అప్పుల భారం 192% పెరిగింది. అయితే ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మాత్రం కేంద్ర ప్రభుత్వ అప్పులు ఏటా తగ్గుముఖం పడుతున్నట్లు తెలిపారు. జీడీపీలో రుణ నిష్పత్తి తగ్గుతూ పోతోందన్నారు. ఈ ఏడాది ఆర్థికలోటు 4.8%కి తగ్గిందని, 2025-26లో దాన్ని 4.4%కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
విద్యకు సాంకేతిక సొబగులు
ప్రపంచం కృత్రిమమేధ దన్నుగా సాంకేతికంగా గణనీయ మార్పులకు లోనవుతోంది. ఈ మార్పులను అందిపుచ్చుకునేలా మన విద్యార్థులు, యువతను సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్రం తాజా బడ్జెట్‌లో కసరత్తు చేసింది. మారుమూల పల్లెల్లోని పాఠశాలల నుంచి ఐఐటీల వరకు అన్నింటిపై ప్రత్యేక దృష్టి నిలిపింది. ఈ మేరకు బడ్జెట్‌లో రూ.1.28 లక్షల కోట్లను కేటాయించింది. ఇందులో ఉన్నత విద్యకు రూ.50,067 కోట్లు, పాఠశాల విద్యకు రూ.78,572 కోట్లు ప్రత్యేకించింది.
►దేశంలో గత పదేళ్లలో 23 ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య 65 వేల నుంచి 1.35 లక్షలకు పెరిగింది. ఈ నేపథ్యంలో 2014 తర్వాత ఏర్పాటైన ఐదు ఐఐటీల్లో అదనపు మౌలిక సౌకర్యాలు కల్పించనుంది. వీటితో 6,500 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. పట్నాలోని ఐఐటీని విస్తరించనుంది.
► ఐఐటీలు, ఐఐఎస్‌సీలలో సాంకేతిక పరిశోధనల కోసం ఈ ఏడాది 10 వేల ఫెలోషిప్‌లకు నిధులు.
► కృత్రిమమేధలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు రూ.500 కోట్ల కేటాయింపు. విద్యా విధానం, పరిశోధనల్లో ఏఐని అనుసంధానించేందుకు ఇది తోడ్పడుతుంది.
► నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యలో పెట్టుబడులపై దృష్టిసారించేందుకు దేశవ్యాప్తంగా ఐదు జాతీయ నైపుణ్య కేంద్రాల ఏర్పాటు.
► ‘భారత్ నెట్’ ప్రాజెక్టులో భాగంగా దేశంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం.
► విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల స్థాపన.
► యూజీసీ, ఎన్‌సీఈఆర్‌టీతోపాటు ఇతర సంస్థలకు పెరిగిన కేటాయింపులు.
► ఐఐఎంలు ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించేందుకు నిరుడు నిధుల్లో కోత పెట్టి రూ.227 కోట్లు ఇవ్వగా... ఈసారి మాత్రం రూ.251 కోట్లు కేటాయించింది.
► పీఎం ఇంటర్న్‌షిప్ పథకం కింద... రానున్న పదేళ్లలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పెట్టుకుంది.
►అయితే, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్)లకు నిరుటితో పోలిస్తే రూ.137 కోట్లు తగ్గాయి. ప్రపంచస్థాయి సంస్థల కోసం నిరుడు రూ.1000 కోట్లు కేటాయించగా ఈసారి రూ.475 కోట్లే ఇచ్చింది.
► ‘భారతీయ భాషా పుస్తక్’ పథకం కింద... పాఠశాలలు, ఉన్నత విద్యాలయాల విద్యార్థులకు అన్ని భారతీయ భాషలపై డిజిటల్ పుస్తకాలు అందించాలని నిర్ణయం.
విద్యా రంగానికి కేటాయింపులు ఇలా... (రూ. కోట్లలో)
2024-25 - 1,14,000
2025-26 - 1,28,639
క్యాన్సర్ బాధితులపై కరుణావీక్షణం
కేంద్ర బడ్జెట్‌లో క్యాన్సర్ బాధితులకు ఉపశమనం కలిగించే పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. పలు రకాల క్యాన్సర్ డ్రగ్‌లపై పన్ను మినహాయింపు, ప్రతి జిల్లాలో క్యాన్సర్ చికిత్స కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు. బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ) నుంచి 36 డ్రగ్స్‌ను పూర్తిగా మినహాయించారు. వీటిల్లో అధిక శాతం క్యాన్సర్ నివారణకు వాడే ఔషధాలున్నాయి. వీటితో పాటు ఆర్థరైటిస్, సోరియాసిస్, తీవ్రమైన ఆస్తమాతో పాటు పలు రకాల వ్యాధులను నయం చేసే ఔషధాలున్నాయి. ఫలితంగా ఆయా జబ్బులతో చికిత్స పొందే వారికి ఆర్థిక భారం తగ్గనుంది. ఉదాహరణకు క్యాన్సర్ చికిత్స నిమిత్తం ఉపయోగించే 100 గ్రాముల ‘వెనిటోక్లాక్స్’ మాత్రల ధర కంపెనీ బట్టి రూ. 35-59వేల వరకు ఉంటుంది. వీటిపై కేంద్రం బీసీడీ మినహాయిస్తే 35- 45% ధరలు తగ్గే అవకాశం ఉంది. క్యాన్సర్ నివారణకు వాడే మరో ఇంజెక్షన్ ఖరీదు రూ. 50వేలు ఉంటుంది. పన్ను మినహాయింపు తర్వాత ఇదే ఇంజక్షన్ కేవలం రూ. 15వేలకే అందుబాటులోకి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రూ. లక్షల్లో ఖరీదైన ఔషధాల ధరలు తగ్గనున్నాయి.
జాబితాలోని 12 ఔషధాల వరకు వివిధ రకాల క్యాన్సర్ చికిత్సకు వాడే మందులు. ఎక్కువ శాతం ఇమ్యునోథెరపీకి వినియోగిస్తారు. రోగుల పరిస్థితిని బట్టి గరిష్ఠంగా 15 డోసులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో డోసుకు రూ. వేల నుంచి మొదలై, రూ. లక్షల్లో ఖరీదైనవి కూడా ఇందులో ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కేంద్రం వీటిపై బేసిక్ కస్టమ్ డ్యూటీ మినహాయింపు ఇవ్వడం వల్ల క్యాన్సర్ రోగులపై ఆర్థిక భారం తగ్గనుంది. ఇతర వ్యాధుల ఔషధాల్లోనూ ఖరీదైనవి ఉన్నాయి. ఆయా రోగులకు ఇవీ ప్రస్తుతం కంటే తక్కువ ధరలకు అందుబాటులోకి రానున్నాయి.
డేకేర్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు
అన్ని జిల్లా ఆసుపత్రుల్లో వచ్చే మూడేళ్లలో డే కేర్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్టు బడ్జెట్టులో ప్రకటించారు. 2025-26లో దేశవ్యాప్తంగా డే కేర్ కేంద్రాలు 200 వరకు ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. ఇప్పుడు చూస్తే క్యాన్సర్ చికిత్స కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే జరుగుతోంది. పెద్ద సంఖ్యలో రోగులు ప్రయివేటు ఆసుపత్రులకే వరుస కడుతున్నారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కేన్సర్ కేంద్రాలు లేకపోవడంతో పల్లె ప్రజలకు క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలో జాప్యం జరుగుతోంది. ప్రతి జిల్లాలోని ఆసుపత్రిలో డేకేర్ కేంద్రం ఏర్పాటు వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చికిత్స అందుబాటులోకి వస్తుంది.
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా పెరగలేదు
కేంద్ర పన్నుల్లో తెలంగాణ రాష్ట్ర వాటాగా వచ్చే ఆదాయం శాతం ఏ మాత్రం పెరగలేదు. జాతీయస్థాయిలో వచ్చిన మొత్తం సొమ్మును రాష్ట్రాలకు పంపకాల శాతాలను బట్టి చూస్తే ...తెలంగాణ 2.1 శాతంతో 15వ స్థానంలో ఉంది. అత్యధికంగా యూపీకి 17.93, బిహార్‌కు 10 శాతం నిధులు వెళుతున్నాయి. తెలంగాణకు వాటా శాతాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కోరుతోంది. ఈ విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని ఇటీవల ఫైనాన్స్ కమిషన్‌కు సైతం వివరించింది. అయినా కొత్త బడ్జెట్‌లో సైతం కేంద్రం మార్పులు చేయలేదు. పన్నుల్లో రాష్ట్రాలకు వాటాగా ఈ ఏడాది (2024-25) రూ.12.86 లక్షల కోట్లకు పైగా ఇస్తున్నామని, దీన్ని మరో 10.53 శాతం పెంచి వచ్చే ఏడాది రూ.14.22 లక్షల కోట్లు ఇస్తామని కేంద్రం వివరించింది. జాతీయ ఆదాయం మొత్తం 10.53 శాతం పెరుగుతుందని అంచనా వేసినందునే వచ్చే ఏడాది తెలంగాణకు ఈ ఏడాదికన్నా మరో రూ.2843 కోట్లు అధికంగా వస్తుంది.
కానీ తెలంగాణ వాటా శాతాన్ని (2.1) మాత్రం పెంచలేదు. ఈ పద్దు కింద.. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో తెలంగాణకు రూ.23,885.15 కోట్లు రాగా, ఈ ఏడాది (2024-25) రూ.27,050 కోట్లు వస్తాయని కేంద్రం తెలిపింది. దీనిపై మరో 10.53 శాతం పెంచి వచ్చే ఏడాది (2025-26) రూ.29,898 కోట్లు ఇస్తామని కేంద్రం బడ్జెట్‌లో వివరించింది. ఈ పద్దు కింద తెలంగాణకు ప్రస్తుత ఏడాది తొలి 8 నెలల్లో (గత ఏప్రిల్ నుంచి నవంబరు వరకు) రూ.17,071 కోట్లు కేంద్రం నుంచి విడుదలయ్యాయి. వచ్చే ఏడాది కేటాయింపుల పెంపుతో.. నాలుగు రాష్ట్రాలకు మాత్రమే రూ.లక్ష కోట్లకు పైగా రానున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్ రూ.2.55 లక్షల కోట్లు, బిహార్ రూ.1.43 లక్షల కోట్లు, మధ్యప్రదేశ్ రూ.1.11 లక్షల కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ.1.07 లక్షల కోట్లతో తొలి 4 ర్యాంకుల్లో ఉన్నాయి. తెలంగాణకన్నా ఝార్ఖండ్, ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాలకు అధికంగా ఈ నిధులు అందనున్నాయి.
పూర్తి వ్యతిరేక వైఖరి.. అయినా బడ్జెట్‌లో బంగ్లాదేశ్‌కు నిధులు
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈసారి విదేశాలకు అందించే సాయం కింద రూ.5.483 కోట్లు కేటాయింపులు జరిగాయి. గత ఏడాది(రూ.5,806)తో పోల్చితే కాస్త తగ్గుదల కనిపించింది. కేంద్ర విదేశాంగ శాఖకు మొత్తం కేటాయింపులు రూ.20,516 కోట్లుగా ఉన్నాయి. హసీనా పదవి కోల్పోయిన తర్వాత భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు ఎన్నడూ లేని స్థాయిలో పతనం అయ్యాయి.
► యూనస్ సర్కారు పూర్తిగా మన దేశానికి వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోంది. కానీ, విశేషం ఏంటంటే..ఆ దేశానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. భారత వ్యతిరేక సర్కారున్న మాల్దీవులకు కూడా సాయం పెరిగింది. ఇక భారత్ నుంచి ఎక్కువ లబ్ధి పొందుతున్న దేశంగా భూటాన్ నిలిచింది.
► భారత్ నుంచి ఎక్కువ మొత్తంలో విదేశీ సాయం పొందుతున్న దేశంగా భూటాన్ కొనసాగుతోంది. 2025-26 బడ్జెట్‌లో ఆ దేశానికి 2,150 కోట్ల కేటాయింపులు చేయగా.. గత ఏడాది(రూ.2,543) తో పోల్చితే మాత్రం కాస్త తక్కువే. అయినప్పటికీ.. భూటాన్ ప్రాథమిక అభివృద్ధి భాగస్వామిగా భారత్ ఉంది. అక్కడి మౌలిక సదుపాయాలు, జల విద్యుత్ ప్రాజెక్టులు తదితర రంగాల్లో భారత పెట్టుబడులు కొనసాగుతున్నాయి.
► మాల్దీవులకు ఆర్థిక సాయం రూ.470 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పెరిగింది. గతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోగా.. భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి మాలే ప్రయత్నిస్తున్న సమయంలో ఈ కేటాయింపులు జరిగాయి.
► అఫ్గాన్‌కు సాయం రెట్టింపైంది. గత ఏడాది రూ.50 కోట్లు కేటాయించగా.. ఈసారి అది రూ.100 కోట్లకు పెరిగింది.
► మయన్మార్‌కు సాయం ఈసారి తగ్గింది. గత ఏడాది రూ.400 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.350 కోట్లకు సాయం తగ్గింది.
► బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించారు.
► ఇక నేపాల్‌కు రూ.700 కోట్లు, శ్రీలంకకు రూ.300 కోట్లు కేటాయించారు. ఆఫ్రికా దేశాలకు సాయం రూ.225 కోట్లకు పెరిగింది. మంగోలియాకు అత్యల్పంగా రూ.5 కోట్లు కేటాయించింది.
► మన విదేశాంగశాఖ ద్వారా విదేశాలకు సాయం అందిస్తుంటాము. వీటిల్లో వ్యూహాత్మకంగా మనకు ముఖ్యమైన దేశాలకు ప్రాధాన్యమిస్తాం. ఇవన్నీ ఆయా దేశాల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయిస్తుంటాము. ప్రాంతీయ అనుసంధానత, సహకారం, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి భారత్ నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీని అనుసరిస్తోంది.
ఆదాయ పన్ను ఊరటతో కోటి మందికి నో ట్యాక్స్: నిర్మలమ్మ
వేతన జీవులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించనక్కర్లేదని వెల్లడించారు. దీనివల్ల అదనంగా కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం నుంచి ఊరట లభించిందని తెలిపారు. ఈమేరకు బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆమె తాజాగా మీడియాతో మాట్లాడారు.
‘‘బడ్జెట్‌లో ఆదాయ పన్ను శ్లాబుల సవరణలతో ప్రజల చేతుల్లో సరిపడా డబ్బులు ఉండేలా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.8 లక్షల ఆదాయం ఉన్నవారు ఇప్పటివరకు రూ.30వేలు పన్ను కట్టేవారు. ఇకపై ఏమీ కట్టనక్కర్లేదు. అలాగే మిగతా శ్లాబుల్లో ఉన్నవారికీ ఊరట కల్పించాం. రూ.12 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ పెంపుతో కోటి మందికి పైగా ప్రజలు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు’’ అని నిర్మలమ్మ వెల్లడించారు.
‘‘ఆర్థికవ్యవస్థలోని ప్రతీ అంశాన్నీ స్పృశించేలా బడ్జెట్‌ను రూపొందించాం. ఖర్చు చేసే ప్రతీ రూపాయి విషయంలో అత్యంత వివేకంతో వ్యవహరించాం. వ్యవసాయ రంగానికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం. విత్తనం నుంచి మార్కెట్ వరకు అన్నిరకాల మార్పులకు శ్రీకారం చుట్టాం. పెట్టుబడి సాయం, రుణాలు, కొత్త వంగడాల సృష్టి.. ఇలా అనేక రకాలుగా రైతులకు మద్దతు ఇస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని మరింత మెరుగుపరిచాం. ఈ బడ్జెట్‌లో విద్యుత్ తయారీ, పంపిణీలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. పెరుగుతున్న అవసరాలకు తగినట్లు విద్యుదుత్పత్తి పంపిణీకి ప్రాధాన్యమిచ్చాం. అవసరమైన మూలధన వ్యయం కల్పించాం’’ అని ఆర్థిక మంత్రి వివరించారు.
74 నిమిషాల బడ్జెట్ ప్రసంగం.. నిర్మలమ్మ రికార్డులిలా...
దేశ ఆర్థిక ప్రగతిలో ఎంతో కీలకమైన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దాదాపు 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును నిర్దేశించే ఈ కేంద్ర పద్దును ఆమె ప్రవేశపెట్టడం ఇది ఎనిమిదోసారి. తద్వారా ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత సాధించారు.
అత్యధికసార్లు బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. ఆయన 10 పద్దులను పార్లమెంట్‌కు సమర్పించారు. ఆ తర్వాత పి.చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ వంటి వారున్నారు. నిర్మలా సీతారామన్ క్రమంగా వారి రికార్డులకు చేరువవుతున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో వరుసగా అత్యధిక బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన రికార్డును నిర్మలమ్మ కొనసాగిస్తున్నారు.
2 గంటల 42 నిమిషాలు..
ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళామంత్రిగానే కాకుండా.. అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. 2020-21లో బడ్జెట్ ప్రవేశపెడుతూ 162 నిమిషాల పాటు ప్రసంగించారామె. అయితే ఒంట్లో నలతగా ఉండడంతో మరో రెండు పేజీలు మిగిలిఉండగానే ప్రసంగాన్ని ముగించారు. దీంతో బడ్జెట్ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది.
అంతకంటే ముందు 2019-20 బడ్జెట్‌లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిడివిపరంగా రెండో అతిపెద్దది. అంతకుముందు 2003-04 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జశ్వంత్‌సింగ్ 135 నిమిషాల పాటు మాట్లాడారు. 2024-25 బడ్జెట్ ప్రసంగంలో పెద్ద పద్దును 86 నిమిషాల్లో (1 గంట 26 నిమిషాలు) ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్ ప్రసంగాల్లో అదే అతి చిన్నది. కాగా నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 74 నిమిషాల పాటు ప్రసంగించారు.
ఈసారీ జనగణన లేనట్లే
జనాభా లెక్కల సేకరణ కసరత్తుకు ఈసారి కూడా నామమాత్రంగా రూ.574.80 కోట్లు కేటాయించారు. 2024-25 బడ్జెట్‌లో రూ.572 కోట్లు ప్రతిపాదించారు. ఈసారి కూడా స్వల్ప మొత్తంతో సరిపెట్టడాన్ని బట్టి.. జనగణన మరింత ఆలస్యం కానుందని స్పష్టమవుతోంది. నిజానికి 2020-21లోనే ఈ క్రతువు జరగాల్సింది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా అది వాయిదాపడింది.
తాజా బడ్జెట్‌లో కేంద్ర హోంశాఖ కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. రూ.2,33,210.68 కోట్లను ఈ పద్దు కింద ప్రతిపాదించారు. 2024-25 కేటాయింపుల (రూ.2,19,643.31 కోట్లు) కన్నా ఇది దాదాపు 6 శాతం ఎక్కువ. తాజా కేటాయింపుల్లో సింహభాగాన్ని (రూ.1,60,391.06 కోట్లు) సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ వంటి కేంద్ర పోలీసు బలగాలకు ప్రత్యేకించారు.
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌కు రూ.41,000.07కోట్లు, అండమాన్, నికోబార్ దీవులకు రూ.6,212.06 కోట్లు, చండీగఢ్‌కు రూ.2,780 కోట్లు, పుదుచ్చేరికి రూ.3,432.20 కోట్లను ప్రతిపాదించారు.
తాజా బడ్జెట్‌లో సీఆర్పీఎఫ్‌కు రూ.35,147.17 కోట్లు, బీఎస్‌ఎఫ్‌కు రూ.28,231.27 కోట్లు, సీఐఎస్‌ఎఫ్‌కు రూ.16,084.83 కోట్లు, ఐటీబీపీకి రూ.10,370 కోట్లు, సశస్త్ర సీమా బల్‌కు రూ.10,237 కోట్లు, అస్సాం రైఫిల్స్ దళానికి రూ.8,274.29 కోట్లు కేటాయించారు.
వైద్య రంగానికి నిధుల చికిత్స
కేంద్ర బడ్జెట్‌లో వైద్య రంగానికి నిధులు భారీగా పెంచారు. అలాగే వైద్య విద్య అభివృద్ధికి పెద్దపీట వేశారు. వైద్యశాఖకు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్‌లో దాదాపు 11 శాతం కేటాయింపులు పెరిగాయి. 2024-25 సంవత్సరం (సవరించిన అంచనా)లో రూ.89,974.12 కోట్లు కేటాయించగా.. 2025-26 బడ్జెట్‌లో రూ.99,858.56 కోట్లు కేటాయించారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖకు కేటాయింపులు రూ.3,497.64 కోట్ల నుంచి రూ.3,992.90 కోట్లకు పెంచారు. ఇది 14.15% అధికం. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు కేటాయించిన రూ.99,858.56 కోట్లలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.95,957.87 కోట్లు, వైద్య పరిశోధనలకు రూ.3,900.69 కోట్లు ఇవ్వనున్నారు. స్వయం ప్రతిపత్తి సంస్థలకు కేటాయింపులను రూ.18,978.72 కోట్ల నుంచి రూ.20,046.07 కోట్లకు పెంచారు.
ఐదేళ్లలో 75వేల వైద్య సీట్లు పెంపు
వైద్య రంగానికి నిధులను పెంచడమే కాకుండా వైద్యవిద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకూ కేంద్రం శుభవార్త చెప్పింది. వైద్య కళాశాలల్లో ఐదేళ్లలో 75 వేల సీట్లు పెంచే లక్ష్యంలో భాగంగా వచ్చే ఏడాది(2025-26లో) 10 వేల సీట్లు పెంచనున్నారు. తమ ప్రభుత్వం గత పదేళ్లలో సుమారు 1.10 లక్షల యూజీ, పీజీ మెడికల్ సీట్లను పెంచిందని, గతంతో పోలిస్తే ఇది 130 శాతం అధికమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఆర్థిక లోటు 4.4%
పన్ను - ఇతర ఆదాయాలు మెరుగ్గా ఉండటంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి, ఆర్థిక లోటు లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఆర్థిక లోటు జీడీపీలో 4.4 శాతానికి పరిమితం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ‘లోటును ఏటా తగ్గించాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంపై రుణభారం తగ్గుతుంది. దీనికి సంబంధించి వచ్చే ఆరేళ్ల ప్రణాళికను ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకటనలో వివరించాం’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయ వసూళ్లు రూ.34.96 లక్షల కోట్లు, నికర పన్ను ఆదాయం రూ.28.37 లక్షల కోట్లు ఉంటుందని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి వెల్లడించారు. మొత్తం వ్యయం రూ.50.65 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూ.11.54 లక్షల కోట్ల వరకూ మార్కెట్లో అప్పులు చేయాల్సి వస్తుంది. దీనికి చిన్న పొదుపు మొత్తాలు, ఇతర రుణాలు కలిసి మొత్తం రూ.14.82 లక్షల కోట్ల మేరకు అప్పులు చేస్తారు. అందువల్ల 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు జీడీపీలో 4.4 శాతానికి మించదని నిర్మలా సీతారామన్ వివరించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తగ్గింది: సవరించిన అంచనాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయ వసూళ్లు రూ.31.47 లక్షల కోట్లు కాగా, నికర పన్ను ఆదాయం రూ.25.57 లక్షల కోట్లు ఉంది. అదే సమయంలో మొత్తం వ్యయం రూ.47.16 లక్షల కోట్లు, అందులో మూలధన వ్యయం రూ.10.18 లక్షల కోట్లు ఉన్నాయి. దీని ప్రకారం ఆర్థిక లోటు జీడీపీలో 4.8% అవుతోంది. తొలుత ఇది 4.9% ఉంటుందని అంచనా వేశారు. సవరించిన అంచనాల ప్రకారం లోటు స్వల్పంగా తగ్గింది.